హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య నీటి వాటాలపై కేఆర్ఎంబీ(కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. ఏపీ నీటి తరలింపులపై ఊసెత్తని కేఆర్ఎంబీ తాజాగా రిజర్వాయర్లలో ఉన్న నీటిని కేవలం తాగునీటికే వినియోగించాలని, విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేయాలని తెలంగాణను ఆదేశించింది. నీటివాటాలపై త్వరలోనే 21వ బోర్డు మీటింగ్ నిర్వహిస్తామని తెలిపింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగాలకు గత నెలలో కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ నేతృత్వంలో త్రీమెన్ కమిటీ సమావేశం నిర్వహించడం, నీటివాటాలపై ఎటూ తేలకపోవడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం జలసౌధలో మెంబర్ సెక్రటరీ సతీశ్ కాంబోజ్ నేతృత్వంలో ఇరు రాష్ర్టాల ఈఎన్సీలు మరోసారి భేటీ అయ్యారు. తొలుత ఏపీ ఈఎన్సీ నర్సింహమూర్తి పలు డిమాండ్లను వినిపించారు.
ఈ ఏడాది కూడా 66:34 నిష్పత్తిలోనే నీటివిడుదల ఉత్తర్వులు జారీ చేయాలని, వచ్చే ఏడాది ఆగస్టు వరకు ఏపీకి 104టీఎంసీలు అవసరమని ప్రతిపాదించారు. అదేవిధంగా శ్రీశైలం నుంచి తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి చేపట్టకుండా నియంత్రించాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు, వెలిగొండ ద్వారా తమ వాటా జలాలనే తరలిస్తున్నామని సమర్థించుకున్నారు. రాయలసీమతోపాటు మారాపురం, పల్నాడు, ఇతర జిల్లాల తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉన్నదని తెలిపారు.
అనంతరం తెలంగాణ ఈఎన్సీ రమేశ్‌బాబు మాట్లాడుతూ.. ఏపీ వాదనలను ఖండించారు. 66:34 నిష్పత్తిలో జలాల వినియోగానికి అంగీకరించేది లేదని, 50:50 నిష్పత్తిలోనే జలాలు వాడుకుంటామని తేల్చిచెప్పారు. తెలంగాణకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు 200 టీఎంసీలు అవసరమని ప్రతిపాదించారు. పోతిరెడ్డిపాడు, వెలిగొండ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా ఏపీ కృష్ణా జలాలను మళ్లిస్తున్నదని ఫిర్యాదు చేశారు. నీటి తరలింపును నిలుపుదల చేయించాలని డిమాండ్ చేశారు.
ఇరు రాష్ర్టాల వాదనల అనంతరం కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ సతీశ్ కాంబోజ్ జోక్యం చేసుకున్నారు. నీటివాటాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పూర్తిస్థాయి బోర్డు మీటింగ్‌లోనే తేల్చుకోవాలని సూచించారు. 21వ బోర్డు మీటింగ్‌లో పూర్తిస్థాయిలో నీటివాటాలపై చర్చిద్దామని సూచించారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయని, మరోవైపు ఎల్ నినో పరిస్థితులున్నాయని తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టం-2014 , 11వ షెడ్యూల్లో 2, 3 పేరాలను అనుసరించి నీటి వినియోగాలు ఉండాలని చెప్పారు. సాగు, తాగునీరు, విద్యుత్తు ఉత్పత్తితో తొలుత తాగునీటికి ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తికి నీటిని వినియోగించడం నిలిపివేయాలని సూచించారు. తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని తెలంగాణ, ఏపీలకు సూచించారు.
ఏపీ ఆదేశించిందే తడవుగా కేఆర్ఎంబీ వ్యవహరిస్తున్నదని మరోసారి తేలిపోయింది. విద్యుత్తు ఉత్పత్తిని నిలిపేయాలని తాజాగా జారీ చేసిన ఆదేశాలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వాస్తవంగా ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగాలకు సంబంధించి తొలుత వాటాలను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ అధికారాలు పూర్తిస్థాయి బోర్డుకే ఉంటాయి. కేఆర్ఎంబీ చైర్మన్ నేతృత్వంలోని మెంబర్లు, ఇరు రాష్ర్టాల సెక్రటరీలు బోర్డు మీటింగ్‌లో నిర్ణయాలు తీసుకుంటారు. ఏ ఏడాదికి ఆయేడు తాత్కాలిక ఒప్పందాలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ 2026-27 నీటి సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు నీటి వాటాలు ఖరారు చేసుకోలేదు.
అయినప్పటికీ పాతపద్ధతిలోనే నీటి వినియోగాలకు అనుమతివ్వాలనే ఎజెండాతో సమావేశం ఏర్పాటుచేయాలని ఏపీ లేఖరాయడం, అందుకు అనుగుణంగా కేఆర్ఎంబీ త్రీమెన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. శుక్రవారం నిర్వహించిన త్రీమెన్ కమిటీ సమావేశంలోనూ తెలంగాణ చేపట్టిన శ్రీశైలం విద్యుత్తుపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోపాటు నిలుపుదల చేయించాలని డిమాండ్ చేసింది. అదే తడవుగా బోర్డు సైతం ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉటంకిస్తూ విద్యుత్తు ఉత్పత్తిని నిలుపుదల చేయాలని తెలంగాణకు ఆదేశాలు జారీ చేయడం కొసమెరుపు. ఇక పోతిరెడ్డిపాడు, వెలిగొండ ద్వారా ఏపీ నీళ్లను తరలిస్తున్నదని, నిలుపుదల చేయించాలని తెలంగాణ డిమాండ్లను మాత్రం బుట్టదాఖలు చేసింది.