అధికారం కోసం నిరుద్యోగులకు కాంగ్రెస్ కొలువుల వలవేసి ఓట్లాట ఆడింది. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకొన్నది. తీరా గద్దెనెక్కిన తర్వాత ‘ఉద్యోగాలేవీ’ అని అడిగితే.. ‘చల్ పో’ అన్నది! జాబ్ క్యాలెండర్ హామీని నమ్మిన యువత నయవంచనకు గురైంది. ఉద్యోగాలపై గంపెడాశలు పెట్టుకున్న అభ్యర్థులను వెయ్యి రోజుల్లో రేవంత్ సర్కార్ దారుణాతి దారుణంగా మోసంచేసింది. ఫలితంగా రాష్ట్రంలో లక్షలాది మంది యువతీయువకులు ఆత్మన్యూనతాభావంతో బతుకాల్సిన దుస్థితి ఏర్పడింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : చేతిలో డిగ్రీ.. కండ్లలో కొలువుల కల.. అశోక్‌నగర్‌లో మకాం. ‘గ్రూప్-1 కోచింగ్‌కు రూ.60 వేలు. గ్రూప్-2కు రూ.25 వేలు. స్టడీ హాల్ ఫీజు రూ.2,000, హాస్టల్‌కు రూ.8 వేలు. ప్రతిసారీ పుస్తకాలు కొనాల్సిందే. న్యూస్‌పేపర్లు.. మ్యాగజైన్లు ఖరీదు చేయాల్సిందే. నెలనెలా రూ.3 వేలు చేతి ఖర్చులు. తల్లిదండ్రులను డబ్బులు అడుగలేని దైన్యం. నలుగురిలో కలువాలన్నా బెరుకు. కుటుంబ సభ్యుల పెండ్లిళ్లు, శుభకార్యాలు, పూర్వ విద్యార్థుల సమ్మేళనాలకు పోలేని పరిస్థితి. పిల్లనిచ్చే అవకాశం లేదు. మరో వైపు తీరిపోతున్న వయోపరిమితి. ‘నీ క్లాస్‌మేట్‌కు పెండ్లయ్యింది.. పిల్లలైండ్రు.. నీదెప్పుడు?’ అంటూ ప్రశ్నలు! ‘ఇంకెప్పుడు ఉద్యోగం కొడుతవ్?’ అని దెప్పిపొడుపు మాటలు.. రాష్ట్రంలోని సగటు నిరుద్యోగి మానసిక వేదన ఇది! వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ తెచ్చిన దుస్థితి ఇది!
ఇటీవల హైడ్రాలో తాత్కాలిక డ్రైవర్ ఉద్యోగ నియామకాల కోసం వేలాది మంది నిరుద్యోగులు పోటెత్తడం రాష్ట్రంలో నిరుద్యోగం ఎంతలా విలయతాండవం చేస్తున్నదనేందుకు అద్దం పట్టింది. నిరుద్యోగులను అదుపు చేయలేక పోలీసులు లాఠీలు పట్టుకొని బెదిరించడం, బలప్రయోగం, అణచివేయడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి ఆశలు కల్పించిన కాంగ్రెస్.. ఇచ్చిన హామీల అమలుపై పూర్తిగా చేతులెత్తేసింది.
సర్కార్ కొలువుల కోసం ఏండ్ల తరబడి పుస్తకాలతో కుస్తీపడుతున్న అభ్యర్థులకు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపులే మిగిలాయి. ఎన్నికల్లో నిరుద్యోగ యువతను వలలో వేసుకొనేందుకు కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. దీన్ని మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. ప్రకటించిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఉద్యోగాలొచ్చే వరకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసింది. అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలిస్తామని చెప్పి ధోకా ఇచ్చింది. 5 లక్షల విద్యాభరోసా కార్డు, రూ.10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనేలేదు.
2023
7,995
2024
9,630
2026
9,719
2027
9,443
2028
8,778
2029
10,001
2030
10,191
2031
10,408
2023 శాసనసభ ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ విసృ్తతంగా హామీలిచ్చింది. అధికారంలోకి వస్తే ఏటా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. నిరుద్యోగులను మభ్యపెట్టింది. బస్సు యాత్ర చేయించి వాడుకున్నది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీ స్థాయిలో నోటిఫికేషన్లు వస్తాయని, ఉద్యోగాలు భర్తీ అవుతాయని అభ్యర్థులు వేచిచూశారు. కానీ హామీ ఇచ్చిన స్థాయిలో ఉద్యోగాల భర్తీ కాలేదు. కేవలం పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను మాత్రమే రేవంత్ సర్కార్ పూర్తిచేసింది. తీరా ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తే ‘అసలు మేం రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీయే ఇవ్వలేదు’ అని బుకాయిస్తున్నది. కేసీఆర్ సర్కార్ నింపిన ఉద్యోగాలకు నియామకపత్రాలు ఇచ్చి తామే ఉద్యోగాలిచ్చినట్టు డబ్బా కొట్టుకుంటున్నది. కాంగ్రెస్ సర్కార్ భర్తీచేశామని చెప్తున్న నోటిఫికేషన్లు 2022, 2023లో వచ్చినవే. వీటిలో గ్రూప్-4 సహా పలు పరీక్షలను బీఆర్ఎస్ హయాంలోనే నిర్వహించారు. కేసీఆర్ సర్కార్ 503 పోస్టుల భర్తీకి ఇచ్చిన గ్రూప్-1కు మరో 60 కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టులకు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ స్థానంలో మరో 5,973 పోస్టులు కలిపి 11 వేల పోస్టులకు నోటిఫికేషన్‌ను జారీచేశారు.
నిరుద్యోగుల భావోద్వేగాలు, బలహీనతను ఆసరాగా చేసుకుని ‘కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్’ అంటూ పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చింది. ముందుగానే పరీక్షల తేదీలు, నోటిఫికేషన్ల వివరాలు తెలిసేలా జాబ్ క్యాలెండర్ తీసుకొస్తామని ప్రకటించింది. దీంతో ప్రతి ఏడాదీ ఏ శాఖలో ఎప్పుడు ఉద్యోగాల భర్తీ జరుగుతుందో ముందుగానే తెలుసుకొని ప్రణాళిక ప్రకారం సిద్ధమవచ్చని అభ్యర్థులు ఆశించారు. 2024 ఆగస్టులో జాబ్ క్యాలెండర్‌ను అసెంబ్లీ వేదికగా ప్రకటించి అటకెక్కిచారు. అర్హత పరీక్ష అయిన టెట్‌ను కూడా జాబ్ క్యాలెండర్లో చేర్చారు. పోనీ ఒక్కటైనా నోటిఫికేషన్ విడుదలైందా? ఒక్క ఉద్యోగమైనా భర్తీ చేశారా? అంటే ఒక్కటీ లేదు. దీంతో అభ్యర్థుల్లో అసంతృప్తి పెరుగుతున్నది. జాబ్ క్యాలెండర్ ఎకడ? నోటిఫికేషన్లు ఎకడ? ఉద్యోగాల భర్తీ ఎప్పుడు? అంటూ యువత రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నది.
‘67 వేల ఉద్యోగాలను భర్తీచేశాం. ఉద్యోగాల భర్తీలో మాదే రికార్డు’ అంటూ గొప్పలు చెప్పుకొన్న కాంగ్రెస్ సర్కార్ అసలు రంగును తానే బయటపెట్టుకున్నది. ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ సాక్షిగా వాస్తవాలను స్వయంగా వెల్లడించింది. 2026 మార్చి వరకు తమ ప్రభుత్వం కేవలం 16,978 ఉద్యోగాలనే భర్తీచేసినట్టు గణాంకాలతో వెల్లడించింది. తాము భర్తీచేశామని చెప్పుకొంటున్న వాటిలో 50,785 ఉద్యోగాలకు బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్లు జారీ అయినట్టు సమాధానమిచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేవలం 16 నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చినట్టు సర్కార్ ఒప్పుకొన్నది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 31,798 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేస్తే, వీటిలో 16,978 ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయని అసెంబ్లీలో సాక్షిగా ప్రకటించింది.

రోడ్డుపక్కన ఓఎమ్మార్షీట్లు రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును నిర్దేశించే ఓఎమ్మార్ షీట్లు, ప్రశ్నాపత్రాలు రోడ్డున పడుతున్నాయి. జూలైలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హెచ్‌డబ్ల్యూవో) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఓఎమ్మార్ షీట్లు శివరాంపల్లిలో రోడ్డుపక్కన కుప్పలు తెప్పలుగా దర్శనమిచ్చాయి. ఇక ఇటీవలే గ్రూప్-3 ప్రశ్నాపత్రాలు పేపర్ ప్లేట్లుగా, మిక్చర్ పొట్లాలుగా మార్చి బేకరీల్లో వాడుతున్న వైనం బయపటపడింది.
నిరుద్యోగులకు ఫీజు మాఫీ అంటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఒకసారి రుసుము చెల్లించి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పేరు నమోదు చేసుకుంటే ఆ సంవత్సరంలో మిగతా నోటిఫికేషన్లకు ఫీజులు మినహాయింపునిస్తామన్నది. కానీ గద్దెనెక్కాక పరిస్థితి తారుమారైంది. అడ్డగోలుగా ఫీజులు పెంచింది. రూ. 200 ఉన్న టెట్ ఫీజును వెయ్యి రూపాయలకు పెంచింది. ఆ తర్వాత నిరుద్యోగుల ఆందోళనతో తగ్గించింది. డీఎస్సీకి వెయ్యి రూపాయలు తీసుకున్నది. ఇటీవలే ఎస్ఐ అభ్యర్థుల ఫీజులను రూ.1,500కు పెంచింది.
నిరుద్యోగులకు ఆర్థికంగా అండగా నిలుస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీనిచ్చింది. నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నది. కానీ అధికారంలోకి వచ్చాక భృతికి గతి లేకుండా పోయింది. 2024 జనవరి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 33 నెలలు పూర్తవుతుంది. నెలకు రూ.4వేల చొప్పున ఒక్కో నిరుద్యోగికి రూ.1.32 లక్షలు బాకీపడింది. రాష్ట్రంలో దాదాపు 31 లక్షల మంది నిరుద్యోగులున్నారు. వీరికి రూ.40,920 కోట్లు నిరుద్యోగ భృతి కింద అందజేయాలి. మూడు లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో 14 శాతం నిరుద్యోగ భృతికి కేటాయించాల్సిన పరిస్థితులున్నాయి.
ఇటీవల అన్నిశాఖల్లో ఉద్యోగుల రిటైర్మెంట్లు ఊపందుకున్నాయి. ఏడాదిలో 9 వేల మంది ఉద్యోగులు రిటైర్మెంట్ పొందారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 9 వేల మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారు. పై స్థాయి పోస్టులు ఖాళీ అయితే కింది వారికి ఉద్యోగోన్నతులివ్వాలి. కింది స్థాయి పోస్టులు ఖాళీ అవుతుంటే వాటినీ భర్తీ చేసుకోవచ్చు. ఓవైపు పోస్టులు ఖాళీ అవుతున్నా రిక్రూట్మెంట్ పత్తాలేకుండా పోయింది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులుండటం గమనార్హం. 3.39 లక్షల మంది ఉద్యోగులంటే, కాంట్రాక్ట్ కింద 66 వేలు, ఔట్సోర్సింగ్ కింద 1.14 లక్షలు, మల్టీపర్సర్ వర్కర్లుగా 53 వేలు, రోజువారీ వేతనం పొందేవారు 9 వేల మంది, గౌరవ వేతనం పొందుతున్న వారు 2.29 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టాల్సి ఉన్నా సర్కార్ చోద్యం చూస్తున్నది.
రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో సర్కార్ ఉద్యోగ ఖాళీల వివరాలు, కొత్త పోస్టుల మంజూరుపై కసరత్తు కోసం మాజీ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో కమిటీ వేసింది. ఈ కమిటీ సమగ్ర అధ్యయనం చేసింది. కానీ ఆ నివేదికను సర్కార్ బయటపెట్టడంలేదు. పరిపాలనా సంస్కరణలు వేగవంతమై కొత్త సంస్థలు, విద్యాసంస్థలు ఏర్పాటవుతున్నాయి. కానీ వీటికి తగినట్టు కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయడంలేదు. పలు కీలక శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా వేదిస్తున్నది. ఉన్నవారిపై పనిభారం పెరిగింది.
చాలా శాఖల్లో పోస్టులు మంజూరు కాక, ఇన్చార్జులతో నెట్టుకొస్తున్నారు. కొత్త జిల్లాల్లో హెచ్‌వోడీ పోస్టులు మంజూరు చేయలేదు. అర్థ గణాంకశాఖ డైరెక్టరేట్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖ పునర్వవస్థీకరణ జరుగలేదు. మహిళా శిశు సంక్షేమశాఖదీ ఇదే పరిస్థితి. మున్సిపల్ ఇంజినీర్ పోస్టులను మంజూరు చేయలేదు. నీటి పారుదలశాఖలోని కొత్త డివిజన్లలో 36 డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలకు విద్యాశాఖాధికారి పోస్టులను మంజూరు చేయలేదు. ఇంటర్ విద్యాధికారుల పోస్టుల్లేవు. నోడల్ అధికారుల చేత నెట్టుకొస్తున్నారు. కొత్తగా యూనివర్సిటీలు, కొన్ని కాలేజీలకు మంజూరు చేసినా పోస్టులు భర్తీ చేయలేదు.

నిన్న మొన్నటి వరకు అతి త్వరలో నోటిఫికేషన్ల జాతరే అంటూ మీడియా, సోషల్ మీడియాలో సర్కార్ పెద్దలు ఊదరగొట్టారు. 35, 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అంటూ ప్రకటనలు గుప్పించారు. పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ అన్నారు. ఏవీ పత్తాలేకుండా పోయాయి. ఆరువేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించి రెండేండ్లు గడిచినా జాడేలేదు. 17వేల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ రెడీగా ఉన్నదని, 2026 మార్చిలోపు ఇస్తామని మంత్రి పొన్నం ప్రకటించారు. ఇదే తరుణంలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలివ్వలేమంటూ శాసనమండలి సాక్షిగా మంత్రి శ్రీధర్‌బాబు చేతులెత్తేశారు.

రాష్ట్రంలో ఉద్యోగులతో పోల్చితే పెన్షనర్ల సంఖ్యే అధికంగా ఉన్నది. వాస్తవానికి ఉద్యోగులెక్కువ.. పెన్షనర్లు తక్కువ ఉండాలి. కానీ రాష్ట్రంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారు 62,239 మంది ఉండగా, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ 58,128 ఉన్నారు. పార్ట్‌టైమ్ ఎంప్లాయిస్ 8,407, అంగన్వాడీ వర్కర్లు 62,443 చొప్పున పనిచేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం ఉద్యోగులు, పెన్షనర్లు 9.16 లక్షల మంది ఉండగా రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య రెండు లక్షల లోపే ఉన్నది. రిటైర్మెంట్ అయ్యే వారి సంఖ్య పెరుగుతుండటంతో పెన్షనర్ల సంఖ్య మరింత పెరిగి, రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య తగ్గే అవకాశం కనిపిస్తున్నది.

ఉద్యోగాల భర్తీలో అనిశ్చితస్థితి యువతలో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నది. ఉద్యోగావకాశాల కొరత, పరీక్షల నిర్వహణలో జాప్యం, నియామకాల్లో కనిపించని పురోగతి నిరుద్యోగుల్లో ఒత్తిడి పెంచుతున్నాయి. సర్కార్ కొలువుల ఆశ నెరవేరే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర వేదన అనుభవిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 18 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఓ నిరుద్యోగి ఉద్యోగాలు భర్తీచేయకపోవడం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాశాడు.

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టుగానే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కూడా రేవంత్ సర్కార్ మభ్యపెడుతున్నది. రూ.వెయ్యి కోట్లతో యూనివర్సిటీలో మౌలిక వసతులు కల్పిస్తానని మాయమాటలు చెప్పి.. అటువైపు కన్నెత్తి చూడకుండా ముఖం చాటేసింది. క్యాంపస్‌కు హంగూ ఆర్భాటాలతో వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యూనివర్సిటీ అభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకొన్నారు. నూతన హాస్టల్ భవనాలు, అకడమిక్ బ్లాక్‌లను పురుషులు, మహిళలకు వేర్వేరుగా నిర్మిస్తామని తెలిపారు.
సరికొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్లాక్, లైబ్రరీ రీడింగ్ రూమ్స్, అధునాతన డిజిటల్ లెర్నింగ్ హబ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అధునాతన స్పోర్ట్స్ సెంటర్, హెల్త్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్, బయో డైవర్సిటీ పార్క్, సరికొత్త రోడ్డు నెట్వర్క్ నిర్మించేందుకు మాస్టర్ ప్లాన్ గీశారు. ఫ్యాకల్టీ, విద్యార్థుల సలహాలు, సూచనలకు ప్రత్యేక డ్రాప్ బాక్స్, క్యూఆర్ కోడ్ అందుబాటులోకి తీసుకొచ్చి అరచేతిలో స్వర్గం చూపించారు. కాంగ్రెస్ పాలనకు వెయ్యి రోజులు పూర్తయినా ఇప్పటిదాకా వెయ్యి కోట్లు కాదు కదా.. వెయ్యి రూపాయలు కూడా విదల్చలేదు. సీఎం చేసిన నమ్మకద్రోహానికి ఇంకోసారి క్యాంపస్‌లో అడుగుపెట్టనీయమని విద్యార్థులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు.

ఉద్యోగాలను భర్తీ చేయకుండా రిటైర్డ్ ఉద్యోగులనే సర్కార్ మళ్లీ కొనసాగిస్తున్నది. కన్సల్టెంట్లు, కాంట్రాక్ట్ పేర వేలకు వేలు జీతాలిచ్చి నడిపిస్తున్నది. రిటైర్డ్ ఉద్యోగులను తొలగించాలని ఉత్తర్వులిచ్చిన సర్కార్ మళ్లీ వారికే బాధ్యతలు అప్పగించింది. బోర్డులు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో అనేక మంది కన్సల్టెంట్లుగా పనిచేస్తున్నారు. విద్యాశాఖ, సింగరేణిలోను కన్సల్టెంట్లే ఉన్నారు.