హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ ఇంటిని సైతం 22(ఏ)లో పెట్టారు. ఈ విషయాన్ని నేను బయటపెడితే రాత్రికి రాత్రి జాబితా నుంచి తీసేశారు. సీఎం ఇంటిని లిస్ట్ నుంచి తీసేసినోళ్లు.. సామాన్యులవి ఎందుకు తీసేయరో చెప్పాలి. ఆయనకేమైనా ప్రత్యేక చట్టం ఉన్నదా? ప్రజలేమో దరఖాస్తులు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగాల్నా?
– హరీశ్‌రావు
మంచిర్యాల, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేసీఆర్ సర్కార్ అసైన్డ్ భూములకు పట్టాలిస్తే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ పట్టా భూములను అసైన్డ్ భూములు చేసి నిషేధిత జాబితాలో పెడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి మీరు చేసిన తప్పులకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలో సమాధానం చెప్పాలని రేవంత్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. రైతుల నోటికాడి బుక్క గుంజుకోవడం.. పట్టా భూములు, అసైన్డ్ భూములను తీసుకెళ్లి నిషేధిత జాబితాలో పెట్టడం.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనా వైఫల్యాలు, నిషేధిత జాబితా 22(ఏ) బాధితులకు అండగా శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో బీఆర్ఎస్ శంఖారావం సభ, మంచిర్యాలలో ప్రెస్మీట్లో హరీశ్‌రావు మాట్లాడారు. రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో కూర్చొని 22ఏ బాధితులందరినీ కబ్జాదారులని మాట్లాడిన మాటలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నిషేధ జాబితా నుంచి రైతుల భూ ములను తొలగించాలని లేకపోతే వేలాది మంది బాధితులతో సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని, అక్కడ సీఎం లేకపోతే జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేదాకా అసెంబ్లీ సమావేశాల్లో బాధితుల పక్షాన గళమెత్తుతామని హామీ ఇచ్చారు. బ్రోకర్లను నమ్మొద్దని, లంచాలు ఇవ్వొద్దని కోరారు.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి.. బొంకులేటి అయిపోయిండని హరీశ్‌రావు విమర్శించారు. నిషేధిత జాబితాలో తప్పైంది సారీ అని నాలుగు అక్షరాల సారీ చెప్తున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. 22ఏ బాధితుల రైతుల కండ్ల లో నీళ్లు చూసి, బ్యాంక్ అప్పు కోసం తల్లడిల్లే వారి బాధలు చూసి మాట్లాడాలని సూచించారు. లక్షల మంది ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి పీడిస్తున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఎందుకు చర్య తీసుకోలేదో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. మీకేమైనా ఫిప్టీ ఫిప్టీ షేరింగ్ ఉన్నదా? లేకపోతే ఎందుకు ఆయనపై చర్య తీసుకోవడం లేదో ప్రజలకు చెప్పాలని నిలదీశారు.
కేసీఆర్ ప్రజలు కేంద్రంగా పాలన చేస్తే, రేవంత్‌రెడ్డి భూముల చుట్టూ తిరుగుతూ పాలన చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ఎవరి భూములు ఎట్లా గుంజుకోవా లి? ఎవరి భూమి 22ఏలో పెట్టాలనే ఆలోచనతో లక్షలాది ఎకరాలను, ఇండ్లు, ప్లాట్లను నిషేధిత జాబితాలో పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో 1000 స్కాములు, 1000 కబ్జాలు, 1000 అబద్ధా లు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.

నెలకు రూ.4వేల పింఛన్ ఇస్తామని ప్రతి అవ్వ, తాతకు ప్రభుత్వం రూ.66వేలు బాకీ పడిందని, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 చొప్పున రూ.82,500 బాకీ పడిందని హరీశ్ పేర్కొన్నారు. ఇవే గాక ప్రతి వర్గానికి పడిన బాకీ వసూలు చేయాలని చెప్పారు.
కేసీఆర్ ఉన్నప్పుడు రోడ్లు వేశారని.. మూ డేండ్ల కాంగ్రెస్ పాలనలో కాగజ్‌నగర్ నియోజకవర్గంలో ఒక్క రోైడ్డెనా వేశారా? ఒక్క బ్రిడ్జి అయినా కట్టారా? ఆలోచించాలని హరీశ్‌రావు ప్రజలను కోరారు. బీఆర్ఎస్ హ యాంలో ఈ ఒక్క నియోజకవర్గంలోనే 42 బ్రిడ్జిలు కట్టించామని గుర్తుచేశారు. ఇప్పుడు తట్టెడు మట్టి కూడా పోసే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంట్రాక్టర్లకు నమ్మకం పోయిందని.. రేవంత్‌రెడ్డికి 15శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తుందని కాంట్రాక్టర్లు టెండర్లు వేయడం లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో రూ.600 కోట్ల టెండర్లు పిలిస్తే ఒక్కరూ టెండర్ వేయలేదని చెప్పారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా కలెక్టర్లు ఏ భూములనైతే నిషేధిత జాబితాలో పెట్టారో ఆ భూములను తొలగించాలని, లేకపోతే కలెక్టరేట్లను ముట్టడిస్తామని, అక్కడే వంటావార్పు చేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాగజ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, మాజీ విప్ బాల్క సుమన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్‌కుమార్, రామ్మోహన్రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, సెప్టెంబర్ 4: రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు శుద్ధమైన మంచినీరు అందించలేని పరిస్థితిలో ఉన్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆర్వో ప్లాంట్ దెబ్బతిని ఏడు నెలలైనా మరమ్మతులు చేయకపోవడంతో స్నానానికి ఉపయోగించే నీరే, తాగాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాఠశాల భవనం శిధిలావస్థకు చేరి తలుపులు, కిటికీలు పగిలిపోయాయి దోమలు వస్తున్నాయని, విద్యార్థులకు ఇప్పటికీ దుస్తులు అందించలేదని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తి, పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు.