హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆబ్కారీ శాఖలో బదిలీలు పాలనాప్రక్రియగా కాదు.. బహిరంగ వేలంపాటగా సాగుతున్నది. ఈసారి ఏకంగా 562 పోస్టులను బహిరంగ మార్కెట్లో పెట్టి విక్రయించారు. పోస్టుకో ధర ఫిక్స్ చేశారు. ఆరు వసూళ్ల కౌంటర్లు ఏర్పాటు చేసి దర్జాగా పోస్టులు అమ్ముకున్నారు. పవర్ హౌస్, ఓ మంత్రి పేషీ, ఎక్సైజ్ బాస్, ఆయన నెత్తిన కూర్చున్న పెద్ద బాస్, దళారులుగా మారిన యూనియన్ నేతలు.. ఇలా ఎవరి దుకాణం వారిదే. ఎవరి దందా వారిదే. ముందస్తుగా రూ.10 లక్షలు అడ్వాన్స్ చెల్లిస్తే పోస్టును రిజర్వ్ చేసి పెట్టారు. ఆర్డర్ చేతికి రాగానే రేటులోని మిగతా పేమెంట్ సమర్పించుకుంటున్నారు. పైరవీల తిమింగలాలు కోట్లు కుమ్మరించి ‘ఫోకల్ టు ఫోకల్’ కుర్చీలను ఎగరేసుకుపోతుంటే, నిబంధనలను నమ్ముకున్న నిజాయితీపరులు మాత్రం మళ్లీ మారుమూల స్టేషన్లకు వెళ్లి, నైరాశ్యంలో కూరుకుపోయారు. బదిలీ ఉత్తర్వులను దొంగచాటుగా వ్యక్తిగతంగా చేరవేయడమే ఈ ముడుపుల బాగోతానికి తిరుగులేని నిదర్శనం.
ఆబ్కారీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రూ.200 కోట్లకుపైగా సాగిన ఈ ‘ప్యాకేజీ’ల బాగోతంపై తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఒకేసారి 562 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు (ఏఈఎస్), సరిల్ ఇన్స్పెక్టర్లు (సీఐ), సబ్ ఇన్స్పెక్టర్లకు (ఎస్సై) ఉద్యోగోన్నతు లు కల్పిస్తూ, బదిలీలు చేస్తూ బుధవారం ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 17 మంది ఏఈఎస్‌లు, 250 మంది సీఐలు, 295 మంది ఎస్సైలకు స్థానచలనం కల్పించింది. ఈ ఉత్తర్వుల వెనుక భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల బదిలీల సమయంలో ఉన్నతాధికారులు నిబంధనల పేరుతో గిరిగీసి, ఎలిజిబిలిటీ లిస్ట్-ఏ, లిస్ట్-బీ, వేకెన్సీ లిస్ట్-సీ అంటూ అణువణువూ గైడ్ లైన్స్ అమలు చేశారు.
చిన్న తేడా వచ్చినా చర్యలు తీసుకుంటామంటూ హూంకరించారు. కానీ కాసులు కురిపించే ఏఈఎస్, సీఐ, ఎస్సై పోస్టుల దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా చేతులెత్తేశారని ఆ శాఖ వర్గాలే ఆరోపిస్తున్నాయి. కింది స్థాయి వారికి ‘నాన్-ఫోకల్ నుంచి ఫోక ల్’ అంటూ నిబంధనల సంకెళ్లు వేసిన యం త్రాంగం, పైస్థాయి అధికారులకు మాత్రం కనీస మార్గదర్శకాలు, ఆప్షన్లు లేకుండా ఇష్టారాజ్యం గా కుర్చీలు కట్టబెట్టిందని చెప్తున్నారు. క్యూర్ పరిధిలోని అధికారులు కచ్చితంగా ఆ పరిధి దా టాల్సిందేనని, ఒక డివిజన్ దాటి బయటకు వెళ్లాల్సిందేనని గతంలో చెప్పిన నిబంధనలను ఎక్సైజ్ కమిషనర్ అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. పైరవీకారులకు కనీసం గల్లీ దాటకుండా పకపకనే ఉన్న ‘ఫోకల్ టు ఫోకల్’ పోస్టులను అప్పనంగా ధారాదత్తం చేశారంటూ ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
ఈ బదిలీల జాబితాను పరిశీలిస్తే కండ్లు బైర్లు కమ్మడం ఖాయం. మెదక్ నుంచి రంగారెడ్డి, శేరిలింగంపల్లి నుంచి జహీరాబాద్, శంషాబాద్ నుంచి సంగారెడ్డి, ఘట్కేసర్ నుంచి పటాన్ చె రు, మలాజిగిరి నుంచి హైదరాబాద్, హయత్ నగర్ నుంచి నల్లగొండ.. ఇలా ఆదాయం సమకూరే ప్రధాన పోస్టులన్నీ ఒకే జోన్ లేదా పకపక ప్రాంతాల్లోనే సర్దుబాటు చేసుకున్నారు. నిజామాబాద్ నుంచి వరంగల్ అర్బన్, మంచిర్యాల నుంచి వరంగల్ అర్బన్, సిద్దిపేట నుంచి కామారెడ్డి, కామారెడ్డి నుంచి నర్సాపూర్ వంటి పోస్టింగులతో నిబంధనలను నవ్వులపాలు చేశా రు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దందాను పరిశీలిస్తే.. నాచారం నుంచి చార్మినార్, లింగంపల్లి నుంచి ధూల్‌పేట్, పటాన్ చెరు నుంచి మీర్పేట్, సికింద్రాబాద్ నుంచి సరూర్‌నగర్, పటాన్చెరు నుంచి చార్మినార్, సీపీఈ నుంచి సికింద్రాబాద్, సీపీఈ నుంచి డిస్టిలరీ, ఎస్టీఎఫ్ నుంచి నాచారం, సరూర్‌నగర్ నుంచి పటాన్చెరు ఇలా ఫోకల్ నుంచి ఫోకల్ పోస్టులకే బదిలీ అయ్యారు.
నిబంధనలను తుంగలో తొకి సాగించిన ఈ పోస్టింగుల పర్వం వెనుక భారీ ముడుపుల వ్యవహారం నడిచిందని ఎక్సైజ్ శాఖ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఒక సీఐ బదిలీ ప్రక్రియకు నాలుగు రోజుల ముందే తాను పైరవీ చే సుకున్న స్టేషన్‌కు వెళ్లి, రూమ్‌ను చూసుకొని రాగా, ఆర్డర్లో అదే స్టేషన్ వచ్చిందని విశ్వసనీయంగా తెలిసింది. పలువురు సీఐలు, ఎస్సైలు ఇరువై రోజుల ముందే తాము అనుకున్న స్టేషన్ల లో ఆదాయ వనరులు, మామూళ్ల లావాదేవీల గురించి అకడి సిబ్బందిని ఆరా తీశారని, చివరికి ఆ స్థానాలనే దక్కించుకున్నారని చెప్తున్నారు. నయాపైసా ముడుపులు ఇవ్వకుండా నికచ్చిగా పనిచేసిన ఉద్యోగులకు ఈ బదిలీల్లో తీరని ద్రోహం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో జరిగిన బదిలీల దందాలో పవర్ హౌస్, కీలక మంత్రి పేషీ, ఆయన సన్నిహితుడి జోరు కొనసాగిందని, కానీ ఈసారి శాఖ ఉన్నతాధికారులు, యూనియన్ నేతల పాత్ర బహిర్గ తం కావడం ఆ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర విస్మయాన్ని కలిగిస్తున్నది. ఇద్దరు యూనియన్ నా యకులు, ఒక రిటైర్డ్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ముఠాగా ఏర్పడి రూ.25 కోట్ల వ్యాపారం నడిపినట్టు ఆరోపిస్తున్నారు. అత్యంత ప్రాధా న్యం కలిగిన 60 పోస్టులకు విచ్చలవిడిగా ధర పలికినట్టు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. స్టేషన్ల ప్రా ధాన్యతను బట్టి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు రేట్ ఖరారు చేశారని సమాచారం. ఇందులో 50% పోస్టులకు యూనియన్ నేత లు, రిటైర్డ్ జేసీ కలిసి ఒకొకరి నుంచి రూ.10 లక్షల చొప్పున అడ్వాన్స్‌లు వసూలు చేసినట్టు తెలిసింది. విషయం తెలిసి ఓ సీఐ సంప్రదించ గా.. ముందస్తుగా రూ.10 లక్షలు కట్టి స్టేషన్ రిజ ర్వ్ చేసుకోవాలని చెప్పారట! తాను అడ్వాన్స్ ఇవ్వలేనని, పోస్టింగ్ వచ్చాక రేట్ కార్డు ప్రకారం ఇస్తానని చెప్పినా, ఒప్పుకోలేదని ప్రచారం జరుగుతున్నది. అడ్వాన్స్ ఇవ్వలేదన్న కక్షతో ఆయన ను ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఓ మారుమూ ల స్టేషన్‌కు విసిరికొట్టినట్టు చెప్పుకొంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ‘ఫోర్స్’ పోస్టింగ్ కోసం ప్యాకేజీ ఏకంగా రూ.80 లక్షల వరకు పలికినట్టు తెలిసింది. ఈ ఫోర్స్‌లో ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు ఉంటారు. అంతకంటే చిన్న ఫోర్స్ పోస్టింగ్‌కు.. అంటే ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు ఉండే ఫోర్స్‌కు రూ.50 లక్షల వరకు ధర పలికినట్టు చెప్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు కీలక ఎస్‌హెచ్‌వో స్టేషన్లు ఒకొకటి రూ.40 లక్షలు, మిగతా సాధారణ స్టేషన్లు రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు అమ్ముడయ్యాయని, సంగారెడ్డి జిల్లాలోని కొన్ని స్టేషన్లు సైతం 30 లక్షలు పలికాయని, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని మేజర్ స్టేషన్లకు రూ.20 లక్షల వరకు రేట్లు ఫిక్స్ చేసి పోస్టింగులు కట్టబెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కొన్ని స్టేషన్లకు ఉత్తిగా పోస్టులు ఇవ్వలేక రూ.3-4 లక్షలు తీసుకున్నారట. మొత్తంగా ఈ బదిలీల దందాలో రూ.వందల కోట్ల వ్యాపారం జరిగినట్టు ఆరోపణలున్నాయి.