పెట్టుబడిదారీ వ్యవస్థపై అంతెత్తున లేచే వామపక్షాలు చల్లబడ్డాయి. పోరాటాల మెరుపు తగ్గి ఎరుపు జెండాలు మూలనపడ్డాయి. అదానీపై రణం సాగిస్తున్న రామన్నపేటకు తోడుగా కమ్యునిస్టులు కాలు కదపలేకపోతున్నారు. తమ జీవితాలను ఛిన్నాభిన్నం చేసేందుకు సిద్ధమైన సిమెంట్ ఫ్యాక్టరీ తమ కొద్దంటూ ప్రజలు నెత్తీనోరు బాదుకుని మొత్తుకుంటున్నా ‘లెఫ్ట్’ చెవికి వినిపించడంలేదు. గ్రామాలకు గ్రామాలనే కబళించేందుకు సిద్ధమైన ఫ్యాక్టరీపై పోరుకు ప్రజలు సిద్ధమైనా ‘ఎర్ర’ నేతలకు పట్టడం లేదు. ఆ దశలోనే.. మేమున్నామంటూ బీఆర్ఎస్ వారికి భరోసా ఇచ్చింది. ‘అదానీ.. గో బ్యాక్’ అంటూ నినదించింది. బీఆర్ఎస్ అండతో రామన్నపేట ఇప్పుడు బెబ్బులిలా తిరగబడుతున్నది. సిమెంట్ ఫ్యాక్టరీ వద్దే వద్దని ప్రజాభ్రిప్రాయ సేకరణలో కుండబద్దలు కొట్టింది. రాజకీయాలకు అతీతంగా తరలివచ్చిన జనం ప్రదర్శన నిర్వహించి, ప్లకార్డులు, నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆరునూరైనా ఫ్యాక్టరీని అడ్డుకుంటామని తెగేసి చెప్పారు.
Adani | నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్23(నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో అదానీకి చెందిన అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ (గ్రూప్ కంపెనీ ఆఫ్ అదానీ) కంపెనీ ఫ్యాక్టరీ ఏర్పాటుపై బుధవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆద్యంతం ఒక్కటే నినాదం మార్మోగింది. అదానీ గోబ్యాక్… అంబుజా సిమెంట్స్ గోబ్యాక్ అంటూ స్థానిక జనం చేసిన నినాదాలతో ప్రజాభిప్రాయ సేకరణ ప్రాంతమంతా హోరెత్తింది. రామన్నపేట మండల కేంద్రానికి ఆనుకుని కంపెనీ ప్రతిపాదిత స్థలంలో కాలుష్య నియంత్రణ మండలి, నల్లగొండ వారి ఆధ్వర్యంలో కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.
యాదా ద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ నేతృత్వంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణకు భారీగా రామన్నపేట ప్రాంత ప్రజలు తరలివచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ ఉదయం 11గంటల నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా 9గంటల వరకే పెద్దఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు. కొంతకాలంగా అదానీ సిమెంట్ కంపెనీకి వ్యతిరేకంగా స్థానికులంతా అఖిలపక్షంగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణ వేదిక పేరుతో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం వీరితో పాటు స్థానిక ప్రజలు రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా తరలివచ్చారు. మహిళలు కొన్ని గ్రామాల నుంచి ట్రాక్టర్లపై తరలిరావడం విశేషం. ఇక్కడికి వచ్చిన వారంతా సిమెంట్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని హెచ్చరించారు.
అడుగడుగునా ఆటంకాలే…
అదానీ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారని కంపెనీ ప్రతినిధులు ముందే ఊహించినట్టున్నారు. అడుగడుగునా ప్రజలు అక్కడికి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అందుకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సహకారం కూడా తీసుకున్నట్టు స్పష్టమైంది. ముందు జాగ్రత్తగా ప్రజాభిప్రాయ సేకరణ స్థలంలో పోలీసులను మోహరించడం పరిపాటి. కానీ అదానీ కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణలో రామన్నపేట చుట్టూ పోలీసులను మోహరించారు. రామన్నపేటకు వచ్చే అన్ని దారుల్లోనూ పోలీసు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని ఆపి ఎక్కడి వెళ్తున్నారు… ఏ పార్టీ వాళ్లు? అంటూ ప్రశ్నలతో వేధించారు.
ఇదే సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ స్థలాన్ని వ్యూహాత్మకంగా రోడ్డు నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్ల లోపల ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రామన్నపేట నుంచి కొమ్మాయిగూడెం వెళ్లే రూట్లో కంపెనీ ప్రధాన గేట్ ఉంది. ఇక్కడ పలువురు సీఐలు, ఎస్ఐలు ఉండి ప్రతి ఒక్కరి ఆధార్‌కార్డును తనిఖీ చేశారు. రామన్నపేట మండలానికి చెందిన వారైతేనే లోపలికి అనుమతించారు. ఇక్కడ పలుమార్లు పోలీసులకు ప్రజలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అక్కడి నుంచి వాహనం ఉంటే తప్ప ప్రజాభిప్రాయ సేకరణ స్థలానికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కాలినడక వచ్చే వాళ్లు అక్కడికి చేరుకునే అవకాశం లేకుండా చేశారు. అయినా సరే వందలాది వాహనాలపై ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడి చేరుకున్నారు.
నల్లబ్యాడ్జీలు… ప్లకార్డులతో నినాదాలు
ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన ప్రజలంతా నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలతో పట్టుకుని ‘అంబుజా సిమెంట్స్ మా కొద్దు.. అదానీ గ్యోబ్యాక్’ అంటూ ప్లకార్డులు, పోస్టర్లను ప్రదర్శించి నిరసన తెలిపారు. ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ స్థలం ఎదురుగా బైఠాయించి పెద్దఎత్తున ధర్నాకు దిగారు. ఇదే సమయంలో అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్‌రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సంగీత భారీ పోలీసు బందోబస్తు మధ్య వేదిక వద్దకు చేరుకున్నారు. వీరు చేరుకునే సమయంలోనే షెడ్లోని ప్రజలు అదానీ సిమెంట్స్ గోబ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ముందుగా కంపెనీ ప్రతినిధి సుబ్బ లక్ష్మణ్ మాట్లాడేందుకు సిద్ధం కాగా పెద్ద ఎత్తున అరుపులు కేకలు, ఈలలతో గో బ్యాక్ అంటూ ముక్తకంఠంతో నినాదాలు చేశారు. ప్రజల నిరసన మధ్యనే కంపెనీ ప్రతినిధి సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతిపాదన వివరాలను వెల్లడించారు.
ప్రజలు నిరసనల హోరులో ఆయన ఏం చెప్తున్నారో ఎవ్వరికీ అర్థంకాక గందరగోళం నెలకొంది. ఆ తర్వాత స్థానికుల నుంచి ముందుగా పేర్లను తీసుకుని ఒక్కొక్కరినీ మాట్లాడించగా 25 మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇందులో రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజాసంఘాలు, మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు ఉన్నారు. వీరందరూ ఏకాభిప్రాయంగా ఇక్కడ కంపెనీ వద్దే వద్దు అంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ రాతపూర్వకంగానే తమ అభ్యంతరాలను అధికారులకు అందజేశారు. బీఆర్ఎస్, సీపీఎం, కాంగ్రెస్, టీడీపీ, గొర్రెల మేకల సంఘం, మత్స్యకార్మిక సంఘం, గీత సంఘం, పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బార్ అసోషియేషన్ ప్రతినిధులు ఇందులో పాల్గొనగా అందరూ పార్టీలకు అతీతంగా ఫ్యాక్టరీని వ్యతిరేకించారు.
కంపెనీ ప్రతినిధుల కుట్రలు
ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికుల నుంచి మద్దతు లభించేలాలేదని కంపెనీ ప్రతినిధులు పలు స్వచ్ఛంద సంస్థలను సంప్రదించినట్టు తెలిసింది. వారికి ముందే డబ్బు, ఇతర ప్రలోభాలకు గురిచేసి ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేశారు. ఇతర ప్రాంతాలకు చెందిన వీరంతా ముందే ప్రజాభిప్రాయ సేకరణ స్థలానికి చేరుకున్నారు. వీరిని గమనించిన స్థానికులు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎవరు రమ్మన్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తాము స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులమని, కంపెనీ వాళ్లు రమ్మంటే వచ్చామని చెప్తుండగా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కంపెనీకి అనుకూలంగా వచ్చిన పెయిడ్ ప్రతినిధులు అక్కడి నుంచి జారుకోక తప్పలేదు.
ప్రభుత్వానికి నివేదిస్తాం
అంబుజా సిమెంట్ కంపెనీ ప్రతిపాదనపై ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అభిప్రాయాలన్నింటినీ ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని వీడియో చిత్రీకరణతో పాటు రికార్డు చేశాం. రాతపూర్వకంగానూ కొందరు అభిప్రాయాలు తెలిపారు. వీరందిరి అభిప్రాయాలను తదుపరి చర్యల కోసం ప్రభుత్వానికి అందజేస్తాం.
– అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్