Harish Rao | సిద్దిపేట, ఆగస్టు 17( నమస్తే తెలంగాణ ప్రతినిధి): రుణమాఫీ సవాళ్లపై వెలసిన ఫ్లెక్సీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య చిచ్చు రగిల్చాయి. ఫ్లెక్సీ వార్ చినికి చినికి గాలివానగా మారి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది. పోలీసుల ఉదాసీనతను ఆసరాగా చేసుకుని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోయారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయంపై శుక్రవారం అర్ధరాత్రి దాడిచేశారు. క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఇరువర్గాలు పోటాపోటీ ర్యాలీలు, నినాదాల మధ్య శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు సిద్దిపేటలో ఉద్రిక్తత నెలకొన్నది. రుణమాఫీ సవాళ్ల నేపథ్యంలో సిద్దిపేటలోని పలు కూడళ్లలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు రాజీనామా చేయాలని అనుచిత కామెంట్లతో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
దీనిపై బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలను తొలిగించాలని మున్సిపాలిటీలో, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చే సినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో బీఆర్ఎస్ నాయకులు బీజేఆర్ చౌరస్తాలో ఆందోళన చేయగా, కాంగ్రెస్ నాయకులు వచ్చి గొడవ చేశారు. ఫ్లెక్సీలను తొలిగించి గొడవ కాకుండా చూడాల్సిన పోలీసులు బీఆర్ఎస్ నాయకుల ను అరెస్ట్ చేసి సిద్దిపేట త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు శుక్రవారం అర్ధరాత్రి తరలించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయి బీజేఆర్ చౌ రస్తా సమీపంలో ఉన్న హరీశ్‌రావు క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. కేసీఆర్, హరీశ్‌రావు ఫ్లెక్సీలను చింపి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న బీఆర్ఎస్ నా యకులకు విషయం తెలిసి పీఎస్ గేట్ ఎదుట ధర్నా చేశారు. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయినా కాంగ్రె స్ కార్యకర్తలను పోలీస్‌స్టేషన్‌కు తరలించలేదు. అర్ధరాత్రి 3గంటలకు బీఆర్ఎస్ నాయకులను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు
దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నల్లబ్యాడ్జీలు ధరించి క్యాంపు కార్యాలయం నుం చి పాత బస్టాండ్ వైపు ర్యాలీగా బయలుదేరా రు. పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు బైఠాయించగానే పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీని దహ నం చేశారు. బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలుపుతున్న సమయంలో పోలీసులు కాంగ్రె స్ నాయకులను అరెస్టు చేసి ఆ దారి గుండా తీసుకెళ్తుండడంతో బీఆర్ఎస్ నాయకులను చూసి కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశా రు. దీంతో ప్రతిగా బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకులు మళ్లీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. క్యాంప్ ఆఫీసుపై కాంగ్రెస్ జెండా, రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీ పెట్టే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత మొదలైంది. కాంగ్రెస్ నాయకులను పోలీస్ స్టేషన్లకు తరలించారు.
మైనంపల్లి హస్తం…?
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి వెనుక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హస్తం ఉందని చర్చ జరుగుతున్నది. సిద్దిపేటలో రాజకీయపరంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా దాడుల సంస్కృతి లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సిద్దిపేటలో మైనంపల్లి పర్యటన చేస్తూ తన గుండాలతో చిల్లర ప నులు చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిద్దిపేట వన్ టౌన్ సీఐకి 20 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని, పోలీసులు కాంగ్రెస్‌కు కొమ్ముకాస్తున్నారని మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి ఆరోపించారు. క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిపై కలెక్టర్, సీపీని కలిసి బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
అడ్డుకోవాల్సిన పోలీసులే రక్షణా?: హరీశ్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ నాయకులు దాడి చేసి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుం డగులను రక్షించడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? ప్రశ్నించారు. డీజీపీ చర్యలు తీసుకోవాలన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మల దహనం
న్యూస్‌నెట్‌వర్క్, ఆగస్టు 17: అధికార బలంతో కాంగ్రెస్ గూండాలు క్యాంప్ కార్యాలయంపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు కన్నెర్ర చేశాయి. సిద్దిపేట పలో, దుబ్బాకలో బస్టాండు వద్ద, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పాత బస్టాండ్ సెంటర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
సిద్దిపేటలో ఇరువర్గాలపై కేసు నమోదు
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు అత్తుమామ్, మహ్మద్ గౌస్, నవాజ్బాబా, మున్నా అక్రమంగా చొరబడి క్యాంప్ ఆఫీస్ ఫ్లెక్సీ బోర్డును చింపివేశారు. హరీశ్‌రావు పీఏ ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు కేసు నమెదు చేశారని సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. కాగా.. శనివారం అకారణంగా పలువురు బీఆర్ఎస్ నేతలపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. పోలీసుల తీరు పై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
అసెంబ్లీ టైగర్ హరీశన్న
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి నేరుగా సిద్దిపేట అధికారిక క్యాంపు కార్యాలయానికి భారీ కా న్వాయ్తో ఎమ్మెల్యే హరీశ్‌రావు శనివారం సాయంత్రం చేరుకున్నారు. అప్పటికే అభిమానులు, పార్టీ శ్రేణులతో కోలహాలంగా క్యాంప్ కార్యాలయం మారింది. క్యాంప్ కార్యాలయానికి హరీశ్‌రావు చేరుకోగానే బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. హరీశ్‌రావు జిందాబాద్, అసెంబ్లీ టైగర్ హరీషన్న అంటూ,.. సీఎం రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హో రెత్తించారు. కార్యకర్తలు హరీశ్‌రావును ఎ త్తుకొని అసెంబ్లీ టైగర్ అంటూ గట్టిగా నినదించారు. మహిళా నాయకులు తిలకం దిద్ది స్వాగతం పలికారు. అక్కడి నుంచి సిద్దిపేట ఎన్జీవో భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పరాకాష్ట
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆఫీస్‌పై కాంగ్రెస్ గుండాల దాడిని పిరికిపందల చర్యగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. పదేండ్లుగా రాష్ట్రం రాజకీయ హింసకు దూరంగా ఉన్నదని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ థర్డ్ రేటెడ్ నీచ రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ‘ఒకవైపు రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాణ్ అని మాట్లాడుతుంటే ఆయన పార్టీ తెలంగాణలో నఫ్రత్ కా దుకాణ్ అంటూ హింసను ప్రేరేపిస్తున్నది. రాజ్యాంగ పరిరక్షకుడిని అని ప్రకటించుకున్న రాహుల్ గాంధీ చేస్తున్న రాజ్యాంగ విలువల పరిరక్షణ ఇదేనా ? అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
దాడి బాధాకరం
హరీశ్‌రావు నివాసంపై దాడిని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ఖండించారు. దాడిదృశ్యాలను చూస్తే చాలా బాధ కలిగిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. హరీశ్‌రావు అంటే ఎంతో గౌరవం అని, ఆయనతో అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపానని వెల్లడించారు.