ఆయన పేరు సీహెచ్ ప్రసాద్‌రావు. పీటీఐఎన్ నంబర్ 1140900341 కలిగిన తన ఇంటికి బీఆర్ఎస్ సర్కారు హయాంలో రూ.101 పథకం కింద ఏటా రూ.1100 మాత్రమే ఆస్తిపన్ను చెల్లించేవారు. సమాచారం లేకుండానే కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టుండి రూ.101 పథకాన్ని ఆపేసింది. ఇప్పుడు ఏటా రూ.10,608 చొప్పున నాలుగేండ్ల ఆస్తి పన్నును రూ. 43,267 ఒకేసారి చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో కంగు తినడం ప్రసాద్‌రావు వంతైంది.
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : పేద, మధ్య తరగతి ప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఆస్తిపన్ను రాయితీ పథకానికి కాంగ్రెస్ సర్కారు పాతరేసింది. నిరుపేదల ముక్కుపిండి ఆస్తిపన్ను వసూలు చేస్తూ ఖజానా నింపుకొంటున్నది. ఇదెక్కడి అన్యాయమని అడిగితే నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నది. రూ.1200లోపు ఆస్తిపన్ను ఉన్న నిర్మాణాలకు 2017లో కేసీఆర్ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది. ఆ పరిధిలోని యజమానులంతా ఏడాదికి రూ. 101 చొప్పున పన్ను చెల్లిస్తే సరిపోతుందని భరోసా ఇచ్చి అమలు చేసింది. ఇందులో భాగంగా ఐదు లక్షల మంది చెల్లింపుదారులకు రూ.100 కోట్ల మేర లబ్ధి జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అనధికారికంగా రద్దు చేసింది. పన్ను సవరణ పేరుతో చెల్లింపుదారుల మెడపై కత్తి పెట్టి ‘మీకు రూ.101 ఆస్తిపన్ను పథకం వర్తించదు.. ఇకపై పూర్తి స్థాయిలో పన్ను చెల్లించాలి’ అంటూ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నది. ఇప్పటికే లక్షన్నర మందికి ఈ రాయితీ పథకాన్ని దూరం చేసిన సర్కారు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తి కాగానే మరో 3.5 లక్షల మందిపై గురిపెట్టి వీరిని కూడా రూ.101 రాయితీ పథకం నుంచి దూరం చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
నగరానికి చెందిన సీహెచ్ ప్రసాద్‌రావుకు సంబంధించి పీటీఐఎన్ నంబర్ 1140900341 కలిగిన ఇంటికి ఏటా రూ.1100 ఆస్తిపన్ను చెల్లించేవారు. రూ.101 పథకం కింద అర్హత పొందిన ప్రసాద్‌రావు ఆశలు కొన్నేళ్లకే అడియాసలయ్యాయి. ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండానే మొత్తం ఆస్తిపన్ను బకాయి కట్టాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. రూ.101 నుంచి ఇప్పుడు ఏటా రూ.10,608 చొప్పున పన్ను వేసి నాలుగేండ్ల ఆస్తిపన్నును ఒకేసారి వేసి మొత్తం రూ.43,267 చెల్లించాలని పేర్కొనడంతో ప్రసాద్‌రావు బిత్తెరపోయాడు. ఈ అన్యాయంపై సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసినా ఫలితం లేకుండా పోయిందని, ప్రట్టించుకునేవారే లేకుండా పోయారని ప్రసాద్‌రావు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలా ఒక్క ప్రసాద్రావే కాదు.. ఇప్పటి వరకు రూ.101 స్కీం నుంచి లక్షన్నర మంది దూరమయ్యారు. వీరంతా ప్రజావాణి, సర్కిల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఫలితం లేదు. ఇదే క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగియగానే మరో 3.5 లక్షల మందిపై ఆస్తిపన్ను పిడుగు పడబోతున్నదని అధికార వర్గాల సమాచారం. వాస్తవంగా సెక్షన్ 220 ప్రకారం ట్యాక్స్ సవరణపై ప్రత్యేకంగా నోటీసులివ్వాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో అధికారులు రూ.101 చెల్లించేవారికి ఇక నుంచి పన్ను రాయితీ లేదంటూ ఎస్ఎంఎస్లు పంపిస్తుండటంపై చెల్లింపుదారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
జీహెచ్ఎంసీ పరిధిలో 19.49 లక్షల ప్రాపర్టీలున్నాయి. వీటిలో రెసిడెన్షియల్ 16.35 లక్షలు, నాన్ రెసిడెన్షియల్ 2.80 లక్షలు, మిక్డ్స్ 34 వేల వరకు ఉన్నాయి. వీటిని ఈ ఆర్థిక సంవత్సరం నాటికి రూ.3 వేల కోట్ల లక్ష్యంలో ఇప్పటి వరకు రూ.1,407 కోట్ల వరకు రాబట్టారు. టార్గెట్ చేరుకోవడానికి ప్రస్తుతం రూ.101 ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాలకు రేట్లను సవరించి పెంచాలని జీహెచ్ఎంసీ నిర్ణయించగా, పెంచిన పన్నునే వసూలు చేస్తున్నారు. నాలుగు క్యాటగిరీల్లోని రెండు లక్షల నిర్మాణాలను సర్వే చే సి, మొత్తంగా రూ.50 కోట్ల మేర ఆదాయం పెంచుకునేలా కసరత్తు చేస్తున్నారు. కాగా ఆస్తిపన్ను పెంచాలంటే జీ హెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో తీర్మానం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా ఉత్తర్వులు ఇవ్వాల్సిందేనని ఓ అధికారి తెలిపారు. కానీ ఇవేవీ చేయకుండానే ఆస్తిపన్ను ఎలా పెంచుతారని పలువురు కార్పొరేటర్లు, రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ అప్రకటిత ఆస్తిపన్ను నిర్ణయాన్ని వచ్చే కౌన్సిల్లో నిలదీస్తామని బీఆర్ఎస్ కార్పొరేటర్లు హెచ్చరిస్తున్నారు.