హైదరాబాద్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను వసూళ్లు రూ. 252 కోట్లకు చేరుకున్నాయి. 5% రిబేటుతో బకాయిలు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాదిలో రూ. 1,667కోట్లు అంచనా వేసుకోగా 132 పట్టణ స్థానిక సంస్థలనుంచి ఇప్పటివరకు రూ. 252కోట్లు వసూలయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ వరంగల్లో రూ. 29కోట్లు, కరీంనగర్లో రూ. 17.70కోట్లు, నిజామాబాద్లో రూ. 14కోట్లు, ఖమ్మంలో రూ. 11.16కోట్లు, మహబూబ్నగర్లో రూ. 10.16కోట్లను వసూలు చేసింది.
మున్సిపాలిటీల్లో మొయినాబాద్ 58శాతం అర్జించగా, గడ్డపోతారం 53.70%, జమ్మికుంట 49%, హుజూరాబాద్ 45%, మూడుచింతలపల్లి 37% లక్ష్యం చేరాయి. మరో 20 పట్టణ స్థానిక సంస్థలు 25% కంటే తక్కువ వసూళ్లు సాధించగా, కొత్తగా ఏర్పడిన మూడుచింతలపల్లి, ఆలియాబాద్, ఎల్లంపేట వంటి మున్సిపాలిటీలు ప్రగతిని సాధించాయి. భూపాలపల్లి, కోహీర్, కేసముద్రం, బోధన్, కల్వకుర్తి, వేములవాడ, సదాశివపేట, ఆదిలాబాద్లో 10% కంటే తక్కువ పన్ను వసూలయ్యాయి.