హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పురపాలికలు, నగరపాలక సంస్థల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. నిరుటి కంటే ఈసారి సానుకూల వృద్ధి నమోదైంది. 2024-25లో రూ.617.38 కోట్లు ఉండగా, 2025-26 నాటికి రూ.685.04 కోట్లకు చేరింది. పన్ను డిమాండ్ కూడా నిరుడు ఉన్న రూ.1,011 కోట్ల నుంచి రూ.1,179 కోట్లకు పెరిగింది. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు వరుసగా ఈ ఏడాది కూడా 100 శాతం పన్ను వసూలు చేసి రికార్డు సృష్టించాయి.
మొత్తం 64 స్థానిక సంస్థల్లో నిరుటి కంటే మెరుగైన వసూలయ్యాయి. 21 కొత్త మున్సిపాలిటీల్లో 16 సంస్థలు మంచి పురోగతిని సాధించాయి. కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్లగొండ నగరాల్లో నిరుటితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. పన్ను వసూళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల ద్వారా 650 కొత్త హ్యాండ్ హెల్డ్ పరికరాలను మున్సిపాలిటీలకు పంపిణీ చేశారు. నిరుడు 42 మున్సిపాలిటీలు 80శాతం కంటే ఎకువ ఆస్తి పన్ను వసూలు చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు 24 పురపాలికలు ఆ మైలురాయిని చేరుకున్నాయి.
