హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డి సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో జనం బెంబేలెత్తుతున్నారు. హైదరాబాద్‌లో భూములు కొనాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే హైడ్రా కూల్చివేతలు, చెరువుల ఆక్రమణల పేరిట నోటీసులతో భయపెడుతున్న ప్రభుత్వం అది చాలదన్నట్టు ఇప్పుడు మరో ‘ముందడుగు’ వేసింది. ప్రజలు ఎప్పుడో కొనుగోలు చేసిన భూములను నిషేధిత జాబితా(22ఏ)లో చేర్చి ముప్పతిప్పలు పెడుతున్నది. వివాదాస్పద భూములనే కాకుండా ఏకంగా హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఔట్లలోని ఆస్తులను సైతం నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) లేదన్న కారణంతో నిషేధిత జాబితాలో పెడుతున్నది. తద్వారా సామాన్య, మధ్యతరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన ఆస్తులను వారి చేతికి దక్కకుండా చేస్తున్నది.
జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుతో ప్లాటో, ఇల్లో కొనుక్కొని రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన సామాన్యులకు సబ్రిజిస్ట్రార్లు గుండె పగిలే విషయం చెప్తున్నారు. ‘మీ ప్రాపర్టీ 22ఏ జాబితాలో ఉన్నదనీ, రెవెన్యూ అధికారుల నుంచి ఎన్వోసీ తీసుకొస్తేనే నిషేధిత జాబితా నుంచి బయటపడుతుందని స్పష్టం చేస్తున్నారు. సర్వేయర్లు, రెవెన్యూ అధికారుల మొదలుకొని జిల్లా కలెక్టర్లు వరకు రాజకీయ నాయకులతో చేతులు కలిపి ప్రజలను నిలువునా దోచుకునేందుకే ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ సేకరించిన సమాచారం ప్రకారం.. మేడ్చల్ జిల్లాలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఏదో ఒక సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలోకి చేర్చారు. కొత్తగా లాక్ చేసిన ప్రధాన సర్వే నంబర్ల వారీగా అధికారులు ఆ జాబితాను విడుదల చేశారు. దీంతో పోచారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 50, 36, కాచవాని సింగారం సర్వే నంబర్ 43, చెంగిచర్ల సర్వే నంబర్ 33/2, పర్వతాపూర్ సర్వే నంబర్ 16, 17, 26, 27, 28లో ఇప్పటికే ప్లాట్లు కొనుక్కున్నవారు గత కొన్ని రోజులుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులకు ఎన్ని వినతిపత్రాలు సమర్పించినా తమ మొర ఆలకించే నాథుడే లేడని ఆవేదన చెందుతున్నారు.
హెచ్ఎండీఏ ఎప్పుడో అభివృద్ధి చేసిన లేఔట్‌లోని ప్లాట్లను కూడా విడిచిపెట్టకుండా నిషేధిత జాబితాలో పెట్టిన జిల్లా యంత్రాంగం.. ఆ ప్లాట్లను కొనుగోలు చేసిన వారికి రక్షణ లేకుండా చేస్తున్నది. నిజానికి హెచ్ఎండీఏ అభివృద్ధి చేసే లేఔట్లకు న్యాయపరమైన చిక్కులేవీ ఉండవని, క్లియర్ టైటిల్‌తో రక్షణాత్మకమైన స్థిరాస్తి సొంతమవుతుందన్న నమ్మకంతో ప్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. కానీ, హెచ్ఎండీఏ వేలం వేసిన ప్లాట్లను కూడా కాంగ్రెస్ సర్కార్ నిషేధిత జాబితాలో చేర్చి వాటి యజమానులను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఇదేమిటని హెచ్ఎండీఏ అధికారులను అడిగితే… నిషేధిత జాబితాలో ఎలా చేరిందో తమకు తెలియదంటూ ఆ ప్లాట్ల యజమానులకు చుక్కలు చూపిస్తున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి గ్రామ సర్వే నంబర్ 62లో డీనోటిఫై చేసిన 56.28 ఎకరాలను ప్రభుత్వం గతంలో రైతులకు కేటాయించింది. వారి నుంచి భూసమీకరణ చేసి 38 మంది రైతులకు ఎకరాకు 600 గజాల చొప్పున డెవలప్ చేసిన ప్లాట్లను పరిహారంగా ఇచ్చింది. మిగిలిన 434 ప్లాట్లు హెచ్ఎండీఏ ఖాతాలో ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు 85 ప్లాట్లను వేలం వేశారు. మరో 68 ప్లాట్లకు ఈ నెల 22న వేలం నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీచేశారు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థ డెవలప్ చేసిన లేఔట్లకే రక్షణ లేకపోతే వాటిలోని ప్లాట్లను ఎలా కొనాలని జనం నిలదీస్తున్నారు.
పైసా పైసా కూడబెట్టి సంపాదించిన ఆస్తులకు రక్షణ లేకుండా చేసి ప్రజల జీవితాలతో ఎందుకు ఆటలాడుతున్నారని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి వెంటనే స్పందించి విచారణ జరిపించాలని, ప్రజలకు రక్షణ కల్పించేలా ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజల ప్రైవేటు ఆస్తులను ఎలాంటి ఆటంకాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలు కల్పించాలని కోరుతున్నారు.