హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో మంత్రి తలసాని ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాధ్, డిప్యూటీ మేయర్ శ్రీలత, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, కార్పొరేటర్ విజయారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, నగర లైబ్రరీ చైర్మన్ ప్రసన్న, సెంట్రల్ జోన్ జోనల్ కమిషనర్ రవి కిరణ్ తో పాటు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలకు సేవా పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ పిలుపుతో 3 రోజులుగా ప్రపంచ మహిళా దినోత్సవం వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపడుచు వివాహానికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద లక్ష్లా 116 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మహిళలను గౌరవించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ముందుగా ఆశ వర్కర్లు, అంగన్ వాడీలు, సామాజిక సేవా కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళలతో కలిసి మంత్రి భోజనం చేశారు.