హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేయాలంటే తప్పనిసరిగా అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతి కల్పించాల్సి ఉంది. అసోసియేట్ నుంచి ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించి, ఖాళీలను భర్తీ చేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. కాగా, డాక్టర్ల సంఘాలు మాత్రం తొలుత గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ప్రొఫెసర్లను నగరానికి తీసుకువచ్చి, ఆ తర్వాతే పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. అందరికీ హైదరాబాద్‌లోనే పోస్టింగ్ ఇస్తే, జిల్లాల్లోని కాలేజీల్లో ఎవరు పనిచేస్తారు?
అందుకే తొలుత జిల్లాల్లోని కాలేజీల్లో పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇదే అంశంపై సోమవారం తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డీఎంఈ నరేంద్రకుమార్‌ను కలిసి విన్నవించారు. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని డీఎంఈ హామీ ఇచ్చినట్టు ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తున్న మరికొంత మంది.. ప్రమోషన్ల తర్వాత జిల్లాల్లో ఉన్న కాలేజీల్లోకి వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ప్రమోషన్లు వద్దని చెబుతున్నట్టు అసోసియేట్ ప్రొఫెసర్లు వివరిస్తున్నారు. దీంతో అసోసియేట్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో గందరగోళం నెలకొన్నది.