హైదరాబాద్, సిటీబ్యూరో, సెప్టెంబర్ 10(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో సరైన సిబ్బందిలేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే దేవాలయాల్లో ఉద్యోగులు, ఆర్చకులకు ప్రమోషన్స్ ఇవ్వాలని దేవాదాయశాఖ కమిషనర్ శైలజారామయ్యర్‌ను తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్‌ను అర్చక ఉద్యోగ జేఏసీ నేతలు బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, అర్చకులకు ప్రమోషన్స్ విషయంలో అన్యా యం జరుగుతున్నదని, సిబ్బంది కొరతపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.
ధూపదీప నైవేద్యాల్లో పనిచేస్తున్న అర్చకులకు కూడా ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని, అందుకు అనుగుణంగా డాటా ఇవ్వడంలో జిల్లాలవారీగా దేవాదాయశాఖ అధికారులు సక్రమంగా పేర్లను నమోదు చేయడం లేదని పేర్కొన్నారు. ధూపదీప నైవేద్యం పథకంలో అర్చకులకు న్యాయం చేయాలని, 99 పీఆర్సీ వర్తింపజేసే విధంగా సమగ్రమైన నివేదిక రూపొందించి సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కమిషనర్‌ను కలిసిన వారిలో జేఏసీ ప్రతినిధులు పీ రవీంద్రాచారి, కాండూరు కృష్ణమాచారి తదితరులు ఉన్నారు.