రంగారెడ్డి, జూలై 5(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. జిల్లాలో 213 మంది గ్రేడ్-2 హిందీ పండిట్లకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కల్పించారు. అయితే ఇందులో మంచాల మండలం తిప్పాయిగూడకు చెందిన బషీర్(సీరియల్-129, రోస్టర్ పాయింట్స్-163)కు ప్రమోషన్ కల్పించడమే విచిత్రం. ఎందుకంటే.. అతను గత ఏడాది జూన్ 1న మరణించారు.
అధికారులు మాత్రం గుడ్డిగా ప్రమోషన్ ఇవ్వడమే కాకుండా పోస్టింగ్ ఇచ్చారు. లిస్ట్‌లో బషీర్ పేరు ఉండటంతో ఉపాధ్యాయులంతా షాక్ అయ్యారు. విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో జరిగిన పొరపాటును గ్రహించి వెంటనే లిస్ట్ నుంచి బషీర్ పేరును తొలగించి మరో లిస్టు విడుదల చేశారు. డీఈవో సుశీందర్‌రావు స్పందిస్తూ.. ఎలాంటి అభ్యంతరాలు రాలేదని, దీంతో చనిపోయిన ఉపాధ్యాయుడి పేరు లిస్టులో వచ్చిందన్నారు. బషీర్ స్థానంలో అర్హులకు పోస్టింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.