ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 6: ఉస్మానియా యూనివర్సిటీలో ప్రమోషన్ల రగడ రోజురోజుకూ తీవ్రమవుతున్నది. ఉద్యోగోన్నతుల్లో అవకతవకలు జరిగాయంటూ అధ్యాపకులు రెండు నెలలుగా ఆందోళన బాట పట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) ఆధ్వర్యంలో రోజూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారు. దీనిపై ఓయూ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై అధ్యాపకులు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందనే విషయంలో ‘నమస్తే తెలంగాణ’ లోతుగా అధ్యయనం చేయగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి.
సీఏఎస్ పేరుతో ప్రమోషన్లు
సాధారణంగా ఓయూలో అధ్యాపకులుగా చేరిన వారికి కెరియర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ పేరుతో ప్రమోషన్లు ఇచ్చేందుకు క్రమం తప్పకుండా వర్సిటీ నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. అనుభవం, యూజీసీ నిబంధనల మేరకు పరిశోధనా పత్రాలు, పీహెచ్డీ పరిశోధనలు ఉంటే ప్రమోషన్లు ఇస్తారు. ఈసారి మాత్రం ఇంటర్వ్యూ మార్కులను మాత్రమే పరిగణనలోనికి తీసుకొని 47 మంది అధ్యాపకులకు ఓయూ అధికారులు ప్రమోషన్లు నిరాకరించారు.
ఇంటర్వ్యూ బోర్డులోని వారితో ముందస్తు సంతకాలు
సాధారణంగా ఇంటర్వ్యూ బోర్డులో సంబంధిత విభాగం హెడ్, డీన్, బయట నుంచి విభాగం నిపుణులు సభ్యులుగా, వీసీ చైర్మన్‌గా కమిటీ ఉంటుంది. కానీ, ఈసారి మాత్రం బోర్డులోని వారితో ముందస్తు సంతకాలు తీసుకొని, తూతూమంత్రంగా ఇంటర్వ్యూలు జరిపించారని అధ్యాపకులు చెబుతున్నారు. ముందస్తు సంతకాలపై ప్రశ్నించిన వారిపై కక్షసాధింపు చర్యలకు దిగుతూ మెమోలు కూడా జారీ చేసినట్టుగా బాధితులు వాపోతున్నారు.
యథేచ్ఛగా యూజీసీ గైడ్‌లైన్స్ ఉల్లంఘన
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం జరగాల్సిన ప్రమోషన్ల ప్రక్రియలో అడుగడుగునా ఉల్లంఘన జరిగిందని అధ్యాపకులు వాపోతున్నారు. ఇంటర్వ్యూ బోర్డులోని వారితో ముందస్తుగా సంతకాలు తీసుకోవడమే దీనికి నిదర్శనమని మండిపడుతున్నారు. ప్రమోషన్ నిరాకరణకు కారణాలు రాతపూర్వకంగా తెలుపాల్సినప్పటికీ రెండు నెలలు గడుస్తున్నా స్పందించడం లేదని చెబుతున్నారు. ఇంటర్వ్యూ మార్కుల విధానాన్ని బహిర్గతం చేయాల్సిన అధికారులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
అస్మదీయులకు ఒకలా..తస్మదీయులకు మరొకలా..
ఓయూ ఉన్నతాధికారులు నిబంధనలను అస్మదీయులకు ఒకలా, తస్మదీయులకు మరొకలా అమలు చేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీసీకి అనుకూలంగా ఉన్నవారికి మాత్రం అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రమోషన్లు నిరాకరించిన వారిలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, బెస్ట్ రీసెర్చర్ అర్డు గ్రహీతలు కూడా ఉండటం ప్రమోషన్లు ప్రక్రియపై మరింత అనుమానాలకు తావిస్తున్నది. మరోవైపు ప్రమోషన్ల అంశంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిందనే ఆరోపణలు సైతం వినిపిస్తుండటం గమనార్హం. యూజీసీ నిబంధనల మేరకు వారికి సంబంధిత అనుభవం, ఇతర పరిశోధనా అనుభవం ఉంటే తప్పనిసరిగా ఇవ్వాల్సిన ప్రమోషన్లు ఉన్నతాధికారుల విచక్షణ మేరకు ఎలా ఆధారపడి ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇప్పటికే వర్సిటీ చాన్స్‌లర్ హోదాలో ఉన్న గవర్నర్‌కు ఔటా ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో బాధిత అధ్యాపకులు న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నారు.
వీసీ రీకాల్‌కు అధ్యాపకుల పట్టు
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వీసీని తక్షణమే రీకాల్ చేయాలని అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. సీఏఎస్‌లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న వీసీపై విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తక్షణమే అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.