హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను దసరా పండుగలోపే అమలు చేయాలని తెలంగాణ ఆటో, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్స్ జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయే ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12,000 భృతి ఇస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన సర్కారు ఆరు నెలలైనా పట్టించుకోవడం లేదని జేఏసీ నాయకులు నందకిషోర్, నర్సింహారెడ్డి, యాకన్న, రవికుమార్, ఈశ్వర్, లిఖిత్కుమార్ సోమవారం ఒక ప్రకటనతో తెలిపారు.
ఉపాధి కరువై పలువురు ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. మృతులను కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దసరా పండుగలోపు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుంటే తెలంగాణ ఆటో, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.