హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ప్రజలను జాగృతం చేసే.. చైతన్య పరిచే.. విజ్ఞానం పంచే కలం శ్రామికులు జర్నలిస్టులు. దీర్ఘకాలిక పని ఒత్తిడికి లోనయ్యే వారిలో వారే ముందుంటారు. ఉదయం లేచించి మొదలు, అర్ధరాత్రి దాటేవరకు అంతులేని ఒత్తిడి.. ఆందోళన.. విశ్రాంతి లేని జీవితంతో అనేకమంది అనారోగ్యం బారిన పడుతున్నారు. మెరుగైన వైద్యం పొందే ఆర్థిక స్థోమత లేక ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి కలం కార్మికుల ఆరోగ్య భద్రతను కాంగ్రెస్ సర్కార్ గాలికొదిలేసింది. ఉద్యోగులతో సమానంగా వారికి హెల్త్‌కార్డులు ఇస్తామని చెప్పి మొండిచెయ్యి చూపింది. కేసీఆర్ సర్కార్‌లో ఎంప్లాయిస్, జర్నలిస్టు హెల్త్ స్కీమ్ (ఈజేహెచ్ఎస్) అమలైంది. కాంగ్రెస్ వచ్చాక ఈ పథకం నుంచి జర్నలిస్టులను తొలగించి, కేవలం ఉద్యోగులకు మాత్రమే హెల్త్‌కార్డులు ఇస్తున్నది. మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఉద్యోగులతో సమానంగా హెల్త్‌కార్డులు ఇవ్వాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఉద్యోగుల కోసం కొత్త ఈహెచ్ఎస్ను కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. అయితే గతంలో ఈజేహెచ్ఎస్ కింద జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు జారీ అయ్యాయి. నిమ్స్, గాంధీ, ఉస్మానియా వంటి దవాఖానల్లో ఈ కార్డులతో జర్నలిస్టులకు ఉచిత వైద్యం అందింది. ఈ స్కీమ్‌ను ఈహెచ్ఎస్గా మార్చడంతో జర్నలిస్టులకు ఇచ్చిన పాత హెల్త్‌కార్డులు పనిచేస్తాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈహెచ్‌ఎస్‌తో జేహెచ్ఎస్ కార్డులను తొలగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి దయనీయంగా మారింది. కొందరు గ్రామీణ విలేకరులు మరింత దారుణంగా తయారైంది. సామాజిక బాధ్యత గల సర్కార్ జర్నలిస్టుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని యూనియన్లు కోరుతున్నాయి. జీతభత్యాల్లేని కొలువులు చేస్తున్న జర్నలిస్టులకు జీవన భద్రత కరువైందని, ఆరోగ్యభద్రత కూడా లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నాయి. కొందరైతే తీవ్రమైన లివర్, డయాలసిస్, కిడ్నీ సంబంధిత వ్యాధుల బారినపడ్డారు. ఏటా 18-20 మంది జర్నలిస్టులు అకాల మరణం పొందుతున్నారు. జర్నలిస్టులే కాదు.. వారి కుటుంబ సభ్యులూ అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నారు.
జర్నలిస్టులకు సంపూర్ణ ఆరోగ్యభద్రత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇస్తున్న తరుణంలో జర్నలిస్టులకు కూడా హెల్త్‌కార్డులు ఇస్తారన్న నమ్మకం ఉండే. కానీ జర్నలిస్టుల నమ్మకాన్ని ప్రభుత్వం వమ్ము చేసింది. హెల్త్‌కార్డులు ఇవ్వాలన్న డిమాండ్‌తో మేము మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చినం. చేద్దాం. చూద్దాం.. ముఖ్యమంత్రితో మాట్లాడి చెప్తాం అని కాలయాపన చేస్తున్నారే తప్ప పురోగతి లేదు. ఏడాదికి కాంట్రిబ్యూషన్‌గా రూ.3 వేల వరకు సమకూరుస్తామని చెప్పాం. అయినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. వెల్నెస్ సెంటర్లతో ఉపశమనం లభించేది. కానీ ఇప్పుడవి అస్తవ్యస్తంగా తయారైనయ్. ఈ సెంటర్లల్లో సేవలు సంతృప్తికరంగా అందడం లేదు. మందులు ఉండటం లేదు. సిబ్బంది కొరత వేధిస్తున్నది. ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని జర్నలిస్టులు అందరికీ హెల్త్‌కార్డులు మంజూరుచేయాలి.
– విరాహత్ అలీ, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు
రాష్ట్రంలో ఏడు లక్షలకు పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు సర్కార్ హెల్త్‌కార్డులు ఇస్తున్నది. ఏడు లక్షల మందికి ఇచ్చిన ప్రభుత్వం కేవలం 20 వేలకు పైగా ఉన్న జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు ఇవ్వలేదా? ఇంతకు మించిన మోసం మరొకటి ఉండదు. 20 వేల జర్నలిస్టులకు కార్డులు ఇవ్వకపోవడం చూస్తుంటే జర్నలిస్టుల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లమైంది. కేసీఆర్ సర్కార్ దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఉద్యోగులతో సమానంగా క్యాష్‌లెస్ హెల్త్‌స్కీమ్ అమలుచేసింది. కాంగ్రెస్ సర్కార్ జేహెచ్ఎస్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి. లేదంటే మా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతాం.
– ఆస్కాని మారుతీసాగర్, టీయూడబ్ల్యూజే (హెచ్143) ప్రధాన కార్యదర్శి
జర్నలిస్టులు, గ్రామీణ విలేకరులకు వేతన భద్రత లేదు. వందలాది మంది జర్నలిస్టులు తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఆరోగ్యభద్రత లేక అవస్థలు పడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ దవాఖానల్లో చేరి చాలామంది అప్పలపాలవుతున్నారు. హెల్త్‌కార్డులు ఇచ్చే విషయంలో కలం కార్మికులను విస్మరించడం దారుణం. ప్రభుత్వం తక్షణమే చొరవ చూపి జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలి. రిటైర్డ్ అయిన వారికి కూడా నగదు రహిత వైద్యాన్ని అందించాలి. కావాలంటే ఉమ్మడి ఏపీలో అమలైన ఆరోగ్య బీమా పథకాన్ని పునరుద్ధరించాలి. ఈ పథకం కోసం జర్నలిస్టులుగా మేం కొంత జమచేస్తాం. ప్రభుత్వం కొంత చెల్లించాలి.
– రావికంటి శ్రీనివాస్, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి