కరీంనగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్ హయాంలో రూపకల్పనచేసిన ప్రాజెక్టులు ఇప్పుడు రైతాంగానికి జీననాధారమై నిలుస్తున్నాయి. అందుకు నిదర్శనం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా రూపుదిద్దుకున్న ఈ పథకం ద్వారానే ఇప్పుటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపల్లి జలాలను ఎత్తిపోస్తున్నది. అయినప్పటికీ, కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ ప్రాజెక్టు కేంద్రంగా మరోసారి రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం పర్యటన తలపెట్టారనే విమర్శలొస్తున్నాయి. నిన్నామొన్నటి వరకు నీటిని ఎత్తిపోసిన పంపులు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏర్పాటు చేసినవా? కాదా? అన్న ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానాలు చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. అన్నం ఉడికిందో లేదో.. చెప్పడానికి ఒక మెతుకు చూస్తే చాలు అన్నట్టు, నీరు లేక వట్టిపోయిన తెలంగాణలో ప్రాజెక్టులకు ప్రాణం పోసింది నిజమా? కాదా? అని చెప్పడానికి నిదర్శనం ఈ పునరుజ్జీవ పథకం.
కాలువ తవ్వడానికే 19 ఏండ్లు
1991లో ఆనాటి ప్రధాని పీవీ నర్సింహారావు వరద కాలువకు శంకుస్థాపన చేశారు. 22 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 122 కిలోమీటర్ల పొడవున నిర్మాణం చేసిన ఈ వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు 20 టీంఎసీల నీటిని తరలించి, 2.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. 1991లో పనులు మొదలైతే, 2010లో ప్రారంభానికి నోచుకున్నది. 122 కిలోమీటర్ల కాలువ తవ్వడానికి ఆనాటి పాలకులకు తీసుకున్న సమయం 19 ఏండ్లు! పోనీ, ప్రారంభం తర్వాత వినియోగంలోకి తెచ్చారా? అంటే అదీ లేదు. వరద కాలువ పూర్తయ్యే నాటికే మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన బాబ్లీ వంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టడంతో శ్రీరాంసాగర్‌కు నీరు రావడం కరువైపోయింది. ఒక దశలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకమైంది. గోదావరి నదిపై ఎగువన కట్టే ప్రాజెక్టులను నిలుపు చేయాలంటూ టీడీపీ, కాంగ్రెస్ డిమాండ్ చేశాయే తప్ప, దిగువన ఉన్న నీటిని ఎలా వాడుకోవాలో ఆలోచించలేదు. ఆనాటి పాలకుల నిర్లక్ష్యంతో శ్రీరాంసాగరే కాదు, వరద కాలువ కూడా వట్టిపోయి క్రికెట్ మైదానాలను తలపించాయి.
రిజర్వాయర్లుగా మార్చిన కేసీఆర్
రైతుల బాధలు తెలిసిన కేసీఆర్ గత పాలకుల మాదిరిగా ఆలోచించలేదు. దిగువన ఉన్న నీటిని ఎగువకు ఎత్తిపోసేందుకు చేపట్టిన కాళేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగానే శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి శ్రీకారంచుట్టారు. కేసీఆర్ విజన్‌కు ఇదో నిలువెత్తు నిదర్శనం. గత ప్రభుత్వాల మాదిరిగా మహారాష్ట్రతో గొడవలు పెట్టుకుంటూ కాలయాపన చేయకుండా నీటిని ఎత్తిపోస్తూ.. వరదకాలువే కాదు ఎస్సారెస్పీని సైతం ఎలా నింపాలన్న ప్లాన్ చేశారు. అందులో భాగంగానే శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం రూపుదిద్దుకున్నది. ఈరోజు లక్షలాది ఎకరాల ఆయకట్టుకు నేనున్నానన్న భరోసా ఇస్తున్నది. రూ.1,999.56 కోట్లతో 2017 ఆగస్టు 10న ముప్కాల్ వద్ద శంకుస్థాపనన చేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్.. అనతి కాలంలోనే పూర్తి చేయించారు.
కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి వరద కాలువ ద్వారా ఎదురెక్కించి, ఏకంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీటిని పోయించి సాగునీటి రంగంలోనే సరికొత్త అధ్యాయానికి తెరలేపారు. పైనుంచి గోదావరి నీరు ఎస్సారెస్పీకి రాకపోయినా, ఆ ప్రాజెక్టును ఎత్తిపోతల ద్వారా నింపి అక్కడి నుంచి వరదకాలువ, కాకతీయ కెనాల్ వంటి ద్వారా గ్రావిటీ రూపంలో నీళ్లు ఇచ్చి దాదాపు 14 లక్షల ఎకరాల ఆయకట్టును కాపాడేందుకు పకడ్బందీగా పథకాన్ని అమలుచేసి చూపించారు. వరద కాలువపై మూడు చోట్ల పంపుహౌస్‌లు ఏర్పాటు చేసి ఏకంగా ఎస్సారెస్పీ వరకు నీటిని ఎత్తిపోసేందుకు ఆనాడు కేసీఆర్ చర్యలు తీసుకోకపోయి ఉంటే, ఈనాడు వరద కాలువ పరీవాహక ప్రాంత రైతాంగం పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలకు కాంగ్రెస్ పాలకులే సమాధానం చెప్పాలి. దాదాపు 88 కిలోమీటర్ల పొడవు వరద కాలువ రిజర్వాయర్లా ఈ రోజు ఇంత వేసవిలోనూ కనిపిస్తుంటే కారణం ఎవరన్నది అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఆరు నెలలైనా గండిపూడ్చని కాంగ్రెస్ సర్కార్
వరద కాలువ 15వ కిలోమీటర్ వద్ద గత సంవత్సరం అక్టోబర్ 9న నిజమాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట వద్ద వరద కాలువకు గండిపడింది. నిజానికి ఇది యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పని. కానీ, ఈ విషయంలోనూ కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చూపుతూ వచ్చింది. దాదాపు ఆరు నెలల గడుస్తున్నా, పనులు మొక్కుబడిగా నడుస్తున్నాయి. ఫలితంగా ఎస్సారెస్పీలో నీళ్లున్నా వరద కాలువకు గండిపడటంతో దిగువకు నీరు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ పూర్తిచేసిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకమే రైతుల పాలిట వరంగా మారింది. ఈ ఒక్క సీజన్లో ఇప్పటివరకు దాదాపు ఐదు నుంచి ఆరు టీఎంసీల నీటిని నాలుగు రోజుల క్రితం ఎత్తిపోశారు. కాళేశ్వరం ఎత్తిపోతల లింక్- 2 పంపుల కింద కేవలం వరద కాలువకే కాదు, శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి తాజాగా ఎత్తిపోశారు.
అక్కడి నుంచి మిగిలిన ప్రాజెక్టులకు నీళ్లు వెళ్తున్నాయి. అంతేకాదు, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసి దాదాపు 40 వేల ఎకరాలకు సాగునీరు, ఇరవై ఆరు గ్రామాలకు తాగునీటికి సైతం ప్రయోజనం కలిగించే రోళ్లవాగు ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.165 కోట్లతో ఆధునీకరించింది. 95% పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టుకు షెటర్ల బిగింపు మాత్రమే మిగిలింది. అయితే షెటర్ల బిగింపు వల్ల అటవీ శాఖకు చెందిన భూములు పోతాయని ఆనాడు అటవీ శాఖ అడ్డుకున్నది. అటవీ శాఖకు ప్రత్యామ్నాయ భూములు చూపుతూ, నాటి బీఆర్ఎస్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు కోరింది. అంతలోనే ఎన్నికలు రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇంతవరకు షెటర్ల బిగింపు పూర్తి కాలేదు. దీంతో ప్రాజెక్టు నిరుపయోగంగా మారిపోయింది. రెండున్నరేండ్లుగా ఇదే దుస్థితి నెలకొన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 90% నుంచి 95% పనులు పూర్తిచేసిన అనేక ప్రాజెక్టులను కూడా గడిచిన రెండేన్నరేండ్లలో కాంగ్రెస్ పూర్తి చేయలేదని చెప్పడానికి రోళ్లవాగు ప్రాజెక్ట్ ఓ నిదర్శనం.