హైదరాబాద్ : పాల్వంచలో గంజాయి, ఆయుధాలు పట్టుకున్న కేసు ఎక్సైజ్ శాఖకు వన్నె తెచ్చిందని, మంచి పేరు తెచ్చిపెట్టిందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫొర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసీం అన్నారు. గంజాయి పట్టుకున్న ఎన్‌ఫొ ర్స్మెంట్ టీమ్‌కు రూ.50 వేల క్యాష్ రివార్డుతోపాటు డైరెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందజేశారు. సోమవారం ఎక్సైజ్ భవన్‌లోని డైరెక్టర్ చాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిబ్బందిని ఆయన అభినందించారు.
గంజాయి ఎలా పట్టుకున్నారు..? ఆయుధాలను ఎలా స్వాధీనం చేసుకున్నారనే విషయాలను అసిస్టెంట్ కమిషనర్ జీ గణేష్ డైరెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో అడిషినల్ జాయింట్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, అసిస్టెంట్ కమిషనర్ ప్రణవి, రివార్డు గ్రహీతలు పాల్గొన్నారు. ఈ ఎక్సైజ్ కేసుతో పలు రాష్ట్రాల్లోని ముఠాల గుట్టు రట్టయ్యిందన్నారు. పాల్వంచలో ఎన్‌ఫొర్స్‌మెంట్ సీఐ రమేష్ టీమ్ 106 కేజీల గంజాయి, ఒక పిస్తోల్, 5 రివాల్వర్లు, 40 బుల్లెట్స్‌ను పట్టుకుంది.
పట్టుబడిన వాళ్లు ముంబైలో దావూద్ ఇబ్రహీం ముఠాలకు ప్రత్యర్థి అయిన రవి పూజరి ముఠా సభ్యులని పోలీసుల విచారణలో తేలింది. మూడు జిల్లాల పోలీసులతోపాటు నేర పరిశోధన పోలీస్ బృందాలు నిందితులను విచారించారు. ఇదే గ్యాంగ్ ఇప్పటికే రెండు మార్లు వెనన్లను, గంజాయిని తరలించిందని, మూడోసారి తరలించే క్రమంలో పట్టుబడిందని విచారణలో వెల్లడయ్యింది.
కేసును చేధించిన ఎక్సైజ్ టీమ్‌లో అసిస్టెంట్ కమిషనర్ జీ గణేష్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ రమేష్, ఎస్సై శ్రీహరిరావు, హెడ్ కానిస్టేబుళ్లు ఎంఏ ఖరీమ్, జీ బాలు, కానిస్టేబుళ్లు సుధీర్, హరీష్, వెంకటేశ్వర్లు, వీరబాబు, విజయ్ కుమార్, ఉపేందర్, హన్మంతరావు ఉన్నారు. వీరందరు డైరెక్టర్ చేతుల మీదుగా క్యాష్ రివార్డులతోపాటు ప్రశంస పత్రాలను అందుకున్నారు.