హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : సర్కారు కాలేజీల్లో రెండోభాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టడమంటే తెలంగాణలో తెలుగును హత్యచేయడమేనని పలువురు ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ఇంటర్‌బోర్డు సమీక్షించాలని ఉస్మానియా తెలుగు శాఖ ఆచార్యులు సాగి కమలాకరశర్మ, ప్రొఫెసర్ కాశీం, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ రఘు ఒక ప్రకటనలో తెలిపారు. ద్వితీయ భాష నిర్ణయం బోర్డు స్వతంత్రంగా తీసుకున్నదా..? ప్రభుత్వ పాలసీయా? అన్నది స్పష్టంచేయాలని డిమాండ్‌చేశారు. నిర్ణయం తీసుకునే ముందు కమిటీ వేశారా..? కమిటీలో సభ్యులెవరు..? ఎవరిని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. ఒకటి నుంచి పీజీ వరకు తెలుగు తీసుకున్నవారి భవిష్యత్ అంధకారమవుతుందని వాపోయారు. స్థాయిని బట్టి కఠిన స్థాయిలో పాఠ్యప్రణాళికలున్నాయని పేర్కొన్నారు.
తెలుగు అధికంగా చదువుకునే మన ప్రాంతంలో తెలుగులో మనమే శిక్షణ ఇవ్వకపోతే ఇతర ప్రాంతాల్లో అవకాశాలు అసలే ఉండవని వాపోయారు. కాలేజీల్లో సంస్కృతాన్ని ప్రవేశపెట్టడం వల్ల ప్రయోజనమేంటో ఆలోచించాలని సూచించారు. ప్రైవేట్ కాలేజీల విద్యార్థుల మార్కుల కోసమే సంస్కృతం ప్రవేశపెడుతున్నారని మండిపడ్డారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు లేని సంస్కృతాన్ని ఇంటర్లో ప్రవేశపెట్టడంతో విద్యార్థులు అటు సంస్కృతం, ఇటు తెలుగు రానివారుగా మిగిలిపోతారని వాపోయారు. ఉన్నతస్థాయి కమిటీవేసి సమీక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలుగును తప్పనిసరి చేసి అన్ని ప్రాంతాల్లో తెలుగును చదివించాల్సిన అవసరమున్నదని హితవుపలికారు.