హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా, గాంధీ, కాకతీయ(కేఎంసీ), నిజామాబాద్(జీఎంసీ) ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ డిమాండ్ చేసింది. బుధవారం టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు నరహరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాలు ప్రసాద్ రాథోడ్, కోశాధికారి ఖాజా రౌఫిద్దిన్, సభ్యులు హైదరాబాద్లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఇటీవల చేపట్టిన ఆయా విభాగాల్లో ప్రొఫసర్ల బదిలీలపై ఉన్న ఆంక్షలను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఫ్యాకల్టీ లేకపోవడంతో వైద్య విద్యపై ప్రభావం చూపుతున్నదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రెండు అంశాలపై మంత్రి చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని కోరారు.