Konda Nageshwar Rao | ఉస్మానియా యూనివర్సిటీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూజీసీ నూతన నిబంధనల ముసాయిదాను అందరూ వ్యతిరేకించాలని ఓయూ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కొండా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. డిటెన్షన్ విధానాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పారు. యూజీసీ నూతన నిబంధనలను వ్యతిరేకిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాలలోని న్యూ సెమినార్ హాల్లో సదస్సును నిర్వహించారు.
ఈ సదస్సుకు ముఖ్య వక్తగా హాజరైన నాగేశ్వరరావు మాట్లాడుతూ.. యూజీసీ నూతన నిబంధనల ద్వారా యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందన్నారు. ఇది పూర్తిగా యూనివర్సిటీల విధ్వంసానికి, రాజకీయ జోక్యానికి ఆద్యం పోసే విధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకంలో నూతన ముసాయిదా ప్రకారం వ్యాపారవేత్తలు, పరిపాలన అనుభవం లేని వారు వైస్ ఛాన్సలర్ అయ్యి వర్సిటీలను వ్యాపార కేంద్రాలుగా మారుస్తారని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ విధానాలను యూనివర్సిటీలలో జొప్పించేందుకు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని వివిధ రూపాలలో ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. విద్యాలయాలను కాషాయ కేంద్రాలుగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోకపోతే భవిష్యత్తులో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందరి ద్రాక్ష లా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కే వేణుగోపాల్ మాట్లాడుతూ.. పాఠశాల విద్యలో డిటెన్షన్ విధానం తీసుకురావడం వలన బాల కార్మిక వ్యవస్థను పెంచి పోషించేందుకు ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థుల సామర్థ్యం, ప్రమాణాలు పెరిగేందుకు ఇది ఎంత మాత్రం ఉపయోగపడదని అభిప్రాయపడ్డారు. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే కొఠారి కమిషన్ సిఫార్సుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులు, కేంద్ర ప్రభుత్వం 10 శాతం నిధులు, దేశ జీడీపీలో ఆరు శాతం నిధులను కేటాయించి అట్టడుగు వర్గాల నుంచి ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.. దాన్ని పక్కనపెట్టి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా డిటెన్షన్ విధానం తీసుకువచ్చి తిరిగి 50 సంవత్సరాలు వెనుకకు తీసుకువెళ్లడమే అవుతుందని అన్నారు.