రవీంద్రభారతి, ఏప్రిల్ 2: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో ప్రభుత్వం చేస్తున్న ప్రకృతి విధ్వంసాన్ని తక్షణమే ఆపాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించడం సరికాదని, అభివృద్ధి పేరుతో చెట్లు, పక్షులు, చెరువులు, గుట్టలను ధ్వంసం చేసుకుంటూపోతే హైదరాబాద్ మరో ఢిల్లీలాగా మారిపోవడం ఖాయమని ఆయన హెచ్చరించారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో పౌరసమాజ మేధావులు, కార్యకర్తలు, హెచ్‌సీయూ విద్యార్థులతో కలిసి ప్రొఫెసర్ హరగోపాల్ మీడియాతో మాట్లాడారు.
ఇప్పటికే వంద ఎకరాల్లో విధ్వంసం చేశారని, ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. మరో 300 ఎకరాల్లో ఉన్న జీవరాశులనైనా కాపాడాలని డిమాండ్ చేశారు. 1969లో 360 మంది విద్యార్థుల బలిదానం వల్ల హెచ్‌సీయూ ఏర్పడిందని గుర్తుచేశారు. హెచ్‌సీయూలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యారని, అలాంటి వర్సిటీని ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు నడుచుకోవాలని హితవు పలికారు. అభివృద్ధి పేరిట ప్రకృతిని నాశనం చేసే అధికారం ఎవరిచ్చారని ధ్వజమెత్తారు. 2003లో చంద్రబాబు వర్సిటీ వినాశనానికి పునాదులు వేశారని, రెండు దశాబ్దాల తర్వాత రేవంత్‌రెడ్డి ఆయన బాటలో నడుస్తూ విధ్వంసానికి నాందిపలికారని మండిపడ్డారు. అభివృద్ధి అంటే ప్రకృతిని నాశనం చేయడమా, ప్రకృతిని నాశనం చేసి సంపదను సృష్టిస్తారా? అని ప్రశ్నించారు.