ఉస్మానియా యూనివర్సిటీ : మావోయిస్టులతో తక్షణమే కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. చర్చలు జరుపుదామని మావోయిస్టులు ప్రతిపాదిస్తున్నా.. కేంద్రం స్పందించకపోవడం సరికాదని అన్నారు. మావోయిస్టులతో కేంద్రం వెంటనే చర్చలను జరపాలని డిమాండ్ చేస్తూ.. వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ‘శాంతి చర్చలు – మేధో స్పందన’ అనే అంశంపై శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ..శాంతి చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడేందుకు కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటన చేయాలని కోరారు.
ఆపరేషన్ కగార్ రాజ్యాంగ వ్యతిరేకమని, రాజ్యాంగబద్ధంగా నడుచుకునే ప్రభుత్వాలు దానిని గౌరవించాలని సూచించారు. సమావేశంలో రీసెర్చ్ స్కాలర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆజాద్, పీస్ కమిటీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, భారత్ బచావో నేషనల్ వైస్ చైర్మన్ డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.