హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): చంద్రబాబు రెండు కండ్ల సిద్ధాంతాన్ని నిజం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి తహతహలాడుతున్నాడని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ అన్నారు. గురుశిష్యులిద్దరూ తెలంగాణ అస్తిత్వాన్ని కాటగలపాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో కొత్తదనమేమీ లేదన్నారు. బుధవారం ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. కోదండరాంరెడ్డి గారూ అని సంబోధించినప్పుడు మోతీలాల్ గారూ అని, బక్క జడ్సన్గారూ అని ఎందుకు అనరని వినోద్‌కుమార్ ప్రశ్నించారు. నిరాహార దీక్ష చేస్తున్నది దళితులు, లంబాడీలు అని మాట్లాడటం ఏమిటి? అని ప్రశ్నించారు. ఆధిపత్యవర్గాల ప్రతినిధిగా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘నేను పాలకుడిని కాదు సేవకుడిని’ అని గొప్పలు చెప్పుకున్న రేవంత్‌రెడ్డి నిలువెల్లా అహంకారాన్ని, ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు వారసుడే రేవంత్‌రెడ్డి..
చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఇద్దరూ గురుశిష్యులనే విషయం లోకమంతా తెలుసని ప్రొఫెసర్ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ పదాన్నే నిషేధించి, తెలంగాణ పాటను బెల్లి లలితక్క రూపంలో ముక్కలు చేసిన చంద్రబాబును తెలంగాణ ఎట్లా నమ్ముతుందని ప్రశ్నించారు. బాబు వారసుడే రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు.
ఒప్పందంతోనే బీజేపీకి 8 ఎంపీ సీట్లు
తెలంగాణ అస్తిత్వాన్ని క్లోజ్ చేయాలని, బీఆర్ఎస్ను బొందపెట్టాలని పార్లమెంట్ ఎన్నికల ముందు ఒప్పందం జరిగిందని ప్రొఫెసర్ వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చెరో 8 సీట్లను గెలిచాయన్నారు. నిజానికి ఇందులో తన గురువైన చంద్రబాబు కలను నిజం చేయాలనే కుట్ర దాగి ఉన్నదని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సహకరించినట్టే రేపు చంద్రబాబు కూటమికి సహకరిస్తాడని, అందులో ఎలాంటి అనుమానమూ లేదన్నారు. చంద్రబాబు కూటమిలో భాగమైన జనసేన, బీజేపీ కలిసి తెలంగాణలో తమ పూర్వచరిత్రకు పూర్వవైభవం తీసుకురావాలని చూస్తున్నాయని ఆరోపించారు.
రెడ్డి వర్గం సీఎం కావాలని కోదండరాంరెడ్డి అనుకున్నడు..
తన సామాజిక వర్గానికి చెందిన జైపాల్రెడ్డినో, జానారెడ్డినో తెలంగాణకు సీఎం కావాలని నాడు సోనియాగాంధీకి కోదండరాంరెడ్డి చెప్పిండు. అయితే పరిస్థితులు తలకిందులై కేసీఆర్ సీఎం కాగానే కోదండరాంరెడ్డి ఆటలు సాగలేదు. అందుకే పగబట్టినట్టు వ్యవహరించాడని వినోద్‌కుమార్ వెల్లడించారు.