హైదరాబాద్, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్‌గా రిటైర్డ్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం నియమితులయ్యారు. తక్షణమే వీరి నియామకం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఈ పదవుల్లో మూడేండ్లపాటు కొనసాగుతారు.
ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ప్రస్తుతం మహీంద్రా యూనివర్సిటీలోని లా స్కూల్ డీన్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గతంలో నల్సార్ లా వర్సిటీ వీసీగా, రిజిస్ట్రార్‌గా పనిచేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలోని పర్వతయ్యపల్లి ఆయన స్వగ్రామం. వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని గంధమల్ల. తొలుత ఆర్టీసీలో పనిచేసిన పురుషోత్తం.. ఆ తర్వాత ఓయూలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పాఠాలు బోధించారు.
కాగా, పలు యూనివర్సిటీలకు ఇన్చార్జి వీసీలను సైతం ప్రభుత్వం నియమించింది. బాసర ట్రిఫుల్ ఐటీ ఇన్చార్జి వీసీగా ప్రొఫెసర్ గోవర్ధన్, హైదరాబాద్ కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీగా ధనావత్ సూర్య నియమితులయ్యారు.