హైదరాబాద్: ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల (Fee Reimbursement) విడుదల కోసం వృత్తివిద్యా కాలేజీ యజమాన్యాలు (FATHI) చేపట్టిన విద్యాసంస్థల బంద్ కొనసాగుతున్నది. యాజమాన్యాలతో ఆదివారం చర్చలు జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సోమవారం మరో దఫా చర్చలు జరపనున్నది. సాయంత్రం 4 గంటలకు ప్రొఫెషనల్ కాలేజీల (Professional Colleges) ప్రతినిధులతో మంత్రులు సమావేశం కానున్నారు.
ఆదివారం రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రజా భవన్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో సుదీర్ఘ చర్చలు జరిగాయి. అయితే ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ప్రతిష్టoభన నెలకొన్నది.
పెండింగ్ టోకెన్ల బకాయిలు మొత్తం రూ.12 వందల కోట్లు కళాశాలలకు తక్షణం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అయితే ఏ కళాశాలలకు ఎంతెంత టోకెన్లు, మిగిలిన బకాయిలు ఉన్నాయనే సమాచార సేకరణకు ఒక రోజు సమయం కావాలని ఆర్థిక శాఖ అధికారులు కళాశాలల యజమాన్యాలని కోరారు.
ఈ నేపథ్యంలో టోకెన్లతోపాటు ఒక్కొక్క కళాశాలకు ఎంత ఫీజు బకాయిలు ఉన్నాయనే వాస్తవాలను, వాటిని ఎప్పుడెప్పుడు చెల్లించాలనే వివరాలను సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రజా భవన్లో ఉప ముఖ్యమంత్రి, మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో జరిగే చర్చల సమావేశంలో అధికారులు వెల్లడిస్తారని ఫెడరేషన్స్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (FATHI) వెల్లడించింది. సమావేశం అనంతరం ఓ పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని తెలిపింది. ఒకవేళ తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోతే మంగళవారం నుంచి సమ్మె యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. సోమవారం రాష్ట్రంలోని ఏ కళాశాలలో తరగతులు జరగవని, జరపరాదని స్పష్టం చేసింది. కొన్ని చోట్ల మాత్రమే జరిగే ఫార్మసీ, బీఎడ్ పరీక్షల విషయంలో ఆయా ప్రాంతాల యాజమాన్యాలు, సంబంధిత యూనివర్సిటీ అధికారుల సమన్వయంతో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. సోమవారం సాయంత్రం చర్చలు సఫలమైతే ఏకాభిప్రాయంతో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటన చేస్తామని, విఫలమైతే సమ్మె కొనసాగుతుందని సంఘం నాయకులు ప్రకటించారు.