హైదరాబాద్, సెప్టెంబర్ 27: హైదరాబాద్కు చెందిన విశ్రాంత ప్రొఫెసర్ నందిపాటి సుబ్బారావుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రభావశీల శాస్త్రవేత్తలతో కూడిన ‘ప్రపంచ ఉత్తమ 2 శాతం శాస్త్రవేత్తల జాబితా-2024’లో ఆయనకు చోటు దక్కింది. అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఈ జాబితాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ శాస్త్రవేత్తల్లో ఆయనకు 3,766వ ర్యాంకు దక్కింది.
వరుసగా ఐదో ఏడాది ఆయన ఈ జాబితాలో నిలవడం విశేషం. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో భూవిజ్ఞాన శాస్త్ర విభాగాధిపతిగా ప్రొఫెసర్ నందిపాటి సుబ్బారావు పని చేశారు. ఆయన పరిశోధనలకు సంబంధించి ఇప్పటివరకు 130 పరిశోధనా పత్రాలు జాతీయ, అంతర్జాతీయ జర్నళ్లలో ప్రచురితమయ్యాయి. ఇంతకుముందు ఆయన నేషనల్ మినరల్ అవార్డుతో పాటు పలు అవార్డులను అందుకున్నారు.