హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శనం చేసిన ప్రొఫెసర్ జయశంకర్‌సార్ బతికి ఉండి ఉంటే బాగుండేదని, పదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని చూసి సంతోషించేవారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. జయశంకర్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణభవన్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జయశంకర్‌సార్ తామందరికీ ఆదర్శప్రాయుడని చెప్పారు. ఇడ్లీ సాంబార్ పోరాటం మొదలు తన శిష్యులు, సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారని, ఇలాంటి సమయంలో జయశంకర్‌సార్ ఉండి ఉంటే పుత్రోత్సాహంతో గర్వపడేవారని పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లాకు, వ్యవసాయ వర్సిటీకి జయశంకర్ పేరు పెట్టుకొని ఆయనను గౌరవించుకున్నామని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు భరత్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఇటీవలే గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ అయిన డాక్టర్ దాసోజ్ శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
అసెంబ్లీలో ఘనంగా జయశంకర్ జయంతి
శాసనసభ, శాసనమండలిలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. జయశంకర్ తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన సేవలను నేతలు స్మరించుకొన్నారు. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం అసెంబ్లీ లాంజ్‌లో ఏర్పాటుచేసిన జయశంకర్ చిత్రపటానికి స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మంత్రులు కేటీఆర్, మహమూద్‌అలీ, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఇంద్రకరణ్‌రెడ్డి, సబిత, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, జైపాల్‌యాదవ్, రాజేందర్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాధోడ్, మహమూద్‌అలీ, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, జీవన్‌రెడ్డి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.