నెన్నెల : ప్రతి యేటా కొనుగోలు కేంద్రం నడుస్తుందన్న నమ్మకంతో రైతులు ధాన్నాన్ని రోడ్డుకు ఇరువైపులా ఆరబెట్టారు. అయితే ఇరువై రోజులు దాటినా ఇప్పటి వరకు ఆ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. తీరా అధికారులను అడిగితే అక్కడ కేంద్రం ఎత్తి వేసినట్లు తెలియడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందు తున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారం గ్రామంలో రైతులు కొనుగోలు కేంద్రం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ దాదాపు 30 లారీల ధాన్యం ఉంటుంది. పీఏసీఎస్ ద్వారా ప్రతి యేటా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారు. కానీ ఈ యాసంగి పంటకు కేంద్రాన్ని ఎత్తి వేశారు.
కేంద్రం ఎప్పటి లాగే ఏర్పాటు చేస్తారని రైతులు తమ పంటను నూర్పిడి చేసి రోడ్ల పక్కన అరపోశారు. మూడు వారాలుగా ఎవరు అక్కడికి వచ్చి చుసిన వారు లేక పోవడం తో రైతులకు అనుమానం వచ్చి అధికారులను సంప్రదించారు. ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని అడిగితే కేంద్రం ఏర్పాటు కు అనుమతి లేదన్న సమాధానం చెప్పారు. వర్షం వస్తే ఇక ధాన్యం చేతికి రాదని ఇప్పటికే ధాన్యం ఎండలకు ఎండి పోయిందని రైతులు దిగులు చెందుతున్నారు. గురువారం బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రైతులను పరామర్శించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాట్లు చేసి రైతుకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.