మహబూబ్ నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ( Procure ) లో జాప్యం చేస్తూ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateshwar Reddy ) మండిపడ్డారు. భూత్పూర్ మండలం హస్నాపూర్లో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో పూర్తిగా నీట మునిగిన వరి ధాన్యాన్ని బుధవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు.
రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీని మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రైతుల సమస్యల గురించి జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తాతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. రైతులకు బస్తాకు అదనంగా 15 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఐకెపీసెంటర్ నిర్వాహకుడు వెంకటయ్య పై చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వము కొనుగోలు విషయంలో నిర్లక్ష్య వైఖరి కారణంగానే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట ఎంత సాగయింది.. ఎంత దిగుబడి వస్తుంది.. ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే దానిపై ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేకపోవడమే ఈ పరిస్థితి కారణమని ఆరోపించారు. తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. వారం రోజుల్లో మొత్తం కొనుగోలు పూర్తి చేయాలని, తడిసిన ధాన్యాన్ని మొత్తం కొనాలని మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.