హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ)పై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. టీవీవీపీని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్)గా మార్చాలని సిబ్బంది కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ హయాంలో టీవీవీపీని డీఎస్‌హెచ్‌గా మార్చే ప్రక్రియను తుది దశకు తీసుకొనిరాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పూర్తి చేసే దిశగా చొరవ చూపడం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు కమిటీని నియమించింది. దీనికి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ చైర్మన్‌గా, డీఎంఈ, డీపీహెచ్, టీవీవీపీ కమిషనర్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్‌లో ఏపీవీవీపీని డీసీహెచ్‌గా ఎలా మార్చారో అధ్యయనం చేసింది. ఇతర రాష్ర్టాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించింది. టీవీవీపీని డీసీహెచ్‌గా మార్చేందుకు డిసెంబర్లోనే ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. కమిటీ నివేదిక ఇచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను అనేకమార్లు మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
జీతాలు ఎప్పుడొస్తాయో తెలియదు
టీవీవీపీని 1987లో ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సంస్థలా కాకుండా, ప్రభుత్వ గ్రాంట్‌తో నడిచే సంస్థగా ఇది ఏర్పాటైంది. వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న ఇతర ఉద్యోగులతో సమానంగా పే స్కేలు, ఇతర ప్రయోజనాలు అమలవుతున్నా.. జీతాలు మాత్రం ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేస్తేనే సిబ్బందికి వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా 010 పద్దు కింద జీతాలు అందుతాయని, కానీ ప్రతి నెలా జీతాల కోసం నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని వాపోయారు. ప్రతినెలా 10 నుంచి 15 తేదీల మధ్య జీతాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, 010 పద్దు కింద జీతాలు ఇవ్వాలని సిబ్బంది కోరుతున్నారు. మరోవైపు, టీవీవీపీ పరిధిలో 1,700 స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేయకపోవడంతో సిబ్బంది కొరత వేధిస్తున్నది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో చివరిసారిగా రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపట్టారు. ఇదే విషయమై టీవీవీపీ కమిషనర్ అధికార వర్గాలను వివరణ కోరగా.. నాలుగు నెలలుగా వైద్య, ఆరోగ్య శాఖ సెక్రటరీ వద్ద ఫైల్ పెండింగ్‌లో ఉన్నదని తెలిపారు.