నల్లగొండ, ఆగస్టు 5: కలెక్టరేట్ వెనుక భాగంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్స్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లబ్ధ్దిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
2017లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని 10 వేల మంది దరఖాస్తులు చేసుకుంటే మూడువేల మందిని అర్హులుగా అప్పటి కలెక్టర్ గుర్తించి డ్రా తీయగా 552 మందిని ఎంపిక చేసినట్టు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రొసీడింగ్స్ ఇవ్వడంలో జాప్యం చేయడంపై అనేక మార్లు ధర్నాలు చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవటం దారుణమని మండిపడ్డారు.