TGSRTC | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సమయానికి జీతాలు రాక పలు విభాగాల్లో ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెండు నెలల నుంచి జీతాలు ఎప్పుడు పడుతాయో తెలియడంలేదని ఆర్టీసీ నాన్ఆపరేషన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల కూడా 12వ తారీఖు వచ్చినా జీతాలు రాలేదని వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6వేల మంది నాన్ఆపరేషన్ ఉద్యోగులు ఉండగా ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్భవన్లోనే 300 మంది ఉన్నారు. జీతాల కోసం ఆందోళనకు దిగితే మెమోలు జారీ చేస్తామంటూ కొందరు అధికారులు హెచ్చరిస్తున్నారని ఉద్యోగులు విలపిస్తున్నారు.
మాడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా 3 నెలలుగా జీతాలు అందడంలేదు. మాడల్ స్కూళ్లలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పీడీ, కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్, నైట్వాచ్మెన్గా పనిచేస్తున్నారు. వీరికి అరకొర జీతం ఇస్తున్నారు. అది కూడా సకాలంలో జీతాలివ్వకపోతే ఎలా అని టీఎంఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి ఆర్టీసీ ఎందుకొచ్చిందో ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారులు ఆలోచించుకోవాలి. ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తే.. అందుకు సంబంధించిన నిధులను ఆర్టీసీకి చెల్లించాలి.