హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బాలానగర్‌లోని ఎంటీఏఆర్ టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీలో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి, బీఆర్టీయూ గౌరవాధ్యక్షుడు వీ శ్రీనివాసగౌడ్ యాజమాన్యాన్ని కోరారు. ఈ మేరకు యూనియన్ నేతలతో కలిసి కంపెనీ డైరెక్టర్ పీ శ్రీనివాసరెడ్డితో సమావేశమయ్యారు. ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏండ్లకు పెంచాలని కోరారు.
సమావేశం తర్వాత శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఇస్రో, డీఆర్డీఎల్, డీఆర్డీవో వంటి ప్రతిష్ఠాత్మకమైన సంస్థల భాగస్వామ్యంతో చంద్రయాన్-2, ఇతర మిషన్లకు స్పేస్, డిఫెన్స్ రంగాల్లో కీలక పరికరాలు, కాంపోనెంట్లను చాలాకాలం నుంచి సరఫరా చేస్తున్నందుకు ఎం టీఆర్ కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కంపెనీ ఎండీ నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు, కంపెనీ జనరల్ సెక్రెటరీ రాజయ్య, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సత్యప్రసాద్, జనార్దన్‌రెడ్డి, వెంకటరామయ్య, సలహాదారులు పాల్గొన్నారు.
రామచంద్రాపురం, జనవరి 2: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ పరిధి కొల్లూర్ ఎస్సై ఎం రమేశ్ రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పీడీఎస్ రైస్ పట్టుకున్న కేసులో డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో లారీ ఓనర్ పేరుని తొలిగించేందుకు ఎస్సై రమేశ్ రూ.30వేలు లంచం డిమాండ్ చేశాడు. రెండు నెలల క్రితం లారీని రిలీజ్ చేసే సమయంలో ఎస్సై రూ.5వేలు లంచం తీసుకున్నారు. ఎస్సై శుక్రవారం మరో రూ.20వేలు బాధితుడి నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకొని డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రమేశ్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని రెండో అదనపు ప్రత్యేక న్యాయస్థానం (ఎస్పీఈ,ఏసీబీ) ముందు హాజరుపరిచారు.