హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ప్రతినిధుల బృందానికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి నవీన్ నికోలస్ హామీనిచ్చారు. శనివారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఆయన గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యారు.
గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, కాంట్రాక్ట్ టీచర్ల రెగ్యులరైజ్, వేసవి సెలవుల్లో పనిచేసిన టీచర్లకు ఎర్నింగ్ వేతనం చెల్లింపు, స్టాఫ్ క్వార్టర్స్ రెంట్ ఫిక్సేషన్ వంటి అంశాలపై సమాలోచనలు జరిపారు. డిగ్రీ కాలేజీ వేళలు ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా మార్చాలని ఈ సందర్భంగా సూచించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు, ప్రధాన కార్యదర్శి ఎన్ దయాకర్, మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి సుధారాణి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు యాదయ్య, డాక్టర్ రామ్మోహన్రావు, రాములు తదితరులు పాల్గొన్నారు.