హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాజకీయాలే పరమావధి గా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవటం బాధాకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సీఎం ఇంటి ముందు మోకాళ్ల మీద నిలబడి అభ్యర్థించినా మొర ఆలకించకపోవటం శోచనీయమని మండిపడ్డారు. గురుకుల అభ్యర్థుల నిరసనకు హరీశ్‌రావు ఎక్స్ వేదికగా బుధవారం మద్దతు ప్రకటించా రు.
గురుకులాల్లో టీచర్ల కొరత లేకుం డా 9,210 టీచర్ పోస్టుల భర్తీకి నాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపా రు. ఒక పోస్టు కూడా మిగిలిపోవద్దనే ఉన్నతహోదా పోస్టుల నుంచి ప్రారంభించి కింది స్థాయి పోస్టుల వరకు ఫలితాలు వెల్లడించి భర్తీ చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరించటం వల్ల ఒకే అభ్యర్థికి ఒకటి కంటే ఎకువ ఉద్యోగాలు వచ్చాయని, తద్వారా దాదాపు 2,500పైగా టీచర్ పోస్టులు మిగిలిపోయి, అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ప్రభు త్వం ఇప్పటికైనా స్పందించి, పోస్టులు బ్యాక్లాగ్ కాకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.