శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 09, 2020 , 01:50:58

5 జీతో ప్రగతి

5 జీతో ప్రగతి

  • గ్రామగ్రామానికీ 5జీ చేరాలి.. భారత్‌కు ‘త్రీ ఐ’ మంత్ర అవసరం
  • సాగు రంగంలో టెక్నాలజీ ద్వారా ఫలితాలు
  • సాంకేతికతలో మన దేశానిది ముఖ్యపాత్ర
  • ప్రపంచంలో లీడర్‌గా ఎదిగేందుకు అవకాశం
  • సంస్కరణల అమలుకు కేంద్రం ధైర్యం చేయాలి
  • ఇక ఇన్నోవేషన్‌పై దృష్టిసారించాలి
  • సీఐఐ వెబినార్‌లో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌

భారతదేశానికి త్రీ ఐ (ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇంక్లూజివ్‌ గ్రోత్‌) మంత్ర ఎంతో అవసరం. వీటిని అమలుచేసి దేశాన్ని మరింత ముందుకు తీసుకొనిపోవచ్చు. త్రీ ఐకి ప్రత్యామ్నాయం లేదు. టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా వ్యవసాయ రంగంలో, డిజిటల్‌ విద్య, ఆన్‌లైన్‌ రిటైల్‌, రోబో సర్వీసుల ద్వారా మెరుగైన సేవలు అందించవచ్చు. టెక్నాలజీ ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. 

- మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఫైవ్‌ (5)జీ నెట్‌వర్క్‌ను వినియోగించుకొని సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. 5జీని దేశంలో ప్రతి మారుమూల గ్రామానికీ అందేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. దేశంలో పెట్టుబడుల ఆకర్షణకు కేంద్ర ప్రభుత్వం సంస్కరణల అమలుపై ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఇన్నాళ్లు సేవారంగంపై దృష్టి పెట్టామని, ఇకపై ఇన్నోవేషన్‌పై దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. వచ్చే శనివారం నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 యేండ్లు పూర్తికానున్న సందర్భాన్ని పురస్కరించుకొని సీఐఐ ఆధ్వర్యంలో ‘రీఇన్వెంటింగ్‌ టెక్నాలజీ ఇన్‌ ఇండియా’ అంశంపై శనివారం వెబినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడు తూ.. 5జీ నెట్‌వర్క్‌ అవకాశాన్ని మనం వదులుకోవద్దని అన్నారు. ఈ టెక్నాలజీతో ఎంతో అభివృద్ధి చెందవచ్చని తెలిపారు. రాబోయే రోజుల్లో 5జీ కీలకపాత్ర పోషించనున్నదని తెలిపారు. 5జీని అభివృద్ధి చేయడంలో భారతదేశం ఎంతో సమర్ధమైనదని, ఆర్థికంగా కూడా ఖర్చు తక్కువ అని చెప్పారు. కరోనా సంక్షోభంలో అనేక రంగాల్లో అనేక విధాలుగా టెక్నాలజీని వినియోగించుకున్నామని గుర్తుచేశారు. ప్రపంచంలో అత్యధిక సాంకేతిక నిపుణులు ఉన్న దేశం మనదేనని, వారు ప్రపంచవ్యాప్తంగా కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా టెక్నాలజీ రంగంలో ఇండియా ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు. ఈ సంక్షోభ సమయంలో మనల్ని మనం నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయమని చెప్పారు.ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల తరువాత టెక్నాలజీ రంగంలో ఇండి యా లీడర్‌గా ఎదుగుతుందని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అడ్వాన్స్‌ టెక్నాలజీని వినియోగించడంలో ముందుందని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డ్రోన్‌ టెక్నాలజీ, బ్లాక్‌ చైన్‌, క్లౌడ్‌ టెక్నాలజీని వేగంగా అమలుచేస్తున్నామన్నా రు.2020 సంవత్సరాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ సంవత్సరంగా ప్రకటించామన్నారు.

‘త్రీ ఐ’ మంత్ర అవసరం

భారతదేశానికి త్రీ ఐ (ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇంక్లూజివ్‌ గ్రోత్‌) మంత్ర ఎంతో అవసరమని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. వీటి ని అమలుచేసి దేశాన్ని మరింత ముందుకు తీసుకపోవచ్చన్నారు. త్రీ ఐకి ప్రత్యామ్నా యం లేదన్నారు. టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా వ్యవసాయ రంగంలో, డిజిట ల్‌ విద్య, ఆన్‌లైన్‌ రిటైల్‌, రోబో సర్వీసుల ద్వారా మెరుగైన సేవలు అందించవచ్చన్నా రు. టెక్నాలజీ ద్వారా మంచి ఫలితా లు వస్తాయన్నారు. అన్ని వర్గాలకు ప్రయోజనకరంగా,లాభదాయకంగా ఉంటుందన్నారు.  

సంస్కరణల అమలుకు ధైర్యం చేయాలి

దేశంలో పెట్టుబడులను ఆకర్షించడానికి సానుకూలమైన విధానాలు అవసరమని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా దృష్టి పెట్టాలని చెప్పా రు. కరోనా సంక్షోభంతో చైనాలోని అనేక కంపెనీలు ఇతర దేశాల వైపు చూస్తున్నాయ ని, ఈ సందర్భంలో భారత్‌ సానుకూలమైన విధానాలను తీసుకరావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలకు మన దేశం సరైన గమ్యమని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులను ఆర్షించడానికి ఇటివలే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ వెహికిల్‌ పాలసీని తీసుకవచ్చిందని ఆయన గుర్తు చేశారు.

మూడోవంతు వ్యాక్సిన్లు ఇక్కడినుంచే..

ప్రపంచానికి అవసరమైన మూడో వంతు వ్యాక్సిన్లను తెలంగాణ నుంచే సరఫరా చేస్తున్నామని చెప్పడానికి గర్విస్తున్నానని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కరోనాకు వ్యాక్సిన్‌ కనుగొనేందుకు దేశంలో ఆరు కంపెనీలు ప్రయత్నిస్తుంటే వాటిలో నాలుగు తెలంగాణకు చెందినవేనని తెలిపారు. కరోనాకు అవసరమైన హెచ్‌సీక్యూ,రెమ్‌డెసివర్‌ ఇక్కడే తయారవుతున్నాయని చెప్పారు. కరోనా సమయంలో ఈ-కామర్స్‌కు భారీగా డిమాండ్‌ వచ్చిందన్నారు. విద్యావ్యవస్థకు ఆన్‌లైన్‌ విద్య పరిష్కారం కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ పాల్గొన్నారు. logo