నారాయణపేట/భూత్పూర్, ఆగస్టు 13: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (పీఆర్ఎల్ఐ)కు జాతీయ హోదా ఇవ్వాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెన వద్ద చేపడుతున్న కురుమూర్తిరాయ రిజర్వాయర్ను ఆదివారం నారాయణపేట మండలానికి చెందిన 800 మంది రైతులతో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్ఎల్ఐపై కాంగ్రెస్ నాయకులు 9 కేసులు వేసి అడుగడుగునా అడ్డుకున్నారని, బీజేపీ నాయకులు అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల ఆశీస్సులతో ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకూ సాగునీరు అందించి రైతుల పాదాలు కడుగుతామని స్పష్టం చేశారు. పీఆర్ఎల్ఐ కెపాసిటీ 90 టీఎంసీలు అని, ఈ ప్రాజెక్టుతో 89 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు.