హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): వడ్డీల ఆశ చూపారు.. కొన్నేండ్ల పాటు అసాధారణ స్థాయిలో వడ్డీలు చెల్లించారు. ఖాతాదారుల నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకొని వందల కోట్లు కూడబెట్టారు. చివరికి తమ గట్టు రట్టయ్యే సమయం వచ్చిందని ఊహించారు. అరుణాచలం వెళ్లి దేవుడిని మొక్కుకున్నారు.. తిరిగి వచ్చి అందరికీ ఐపీ పెట్టారు. మెల్లిగా బిచాణా ఎత్తేద్దామనుకుంటుండగా.. అప్రమత్తమైన ఖాతాదారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత నెల 30న ప్రియాంక ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులను అరెస్టు చేశారు. నిందితులు 543 మందికి ఐపీ నోటీసులు పంపించగా, వారిలో 145 మంది వరకు వచ్చి పోలీసులను ఆశ్రయించారు. వీరిలో ఒక్కొక్కరు రూ.10 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తున్నది. ఈ మోసం విలువ తొలుత రూ.200 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేసినప్పటికీ.. బాధితుల సంఖ్య పెరుతుండటంతో అది రూ.500 కోట్ల వరకు ఉండే అవకాశమున్నదని భావిస్తున్నారు. ఈ సొమ్మును నిందితులు ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఏం ఆస్తులు కొన్నారో తెలుసుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
35 ఏండ్లుగా చిట్‌ఫండ్ వ్యాపారం
తెలంగాణ స్టేట్ కోఅపరేటివ్ అపెక్స్ బ్యాంక్(టెస్కాబ్)లో జనరల్ మేనేజర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ వాణీబాల ఆమె భర్త మేక నేతాజీతో కలిసి 1986లో ప్రియాంక చిట్‌ఫండ్ పేరుతో ఫైనాన్స్ సంస్థను ఏర్పాటు చేశారు. వాణీబాల తమ బ్యాంకుకు వచ్చే డిపాజిట్‌దారులను ప్రియాంక చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలని నెలవారీ 24 శాతం వడ్డీ వస్తుందని చెప్పడంతో అధిక వడ్డీకి ఆశపడి చాలామంది వచ్చి చేరారు. నిందితులు అంచెలంచెలుగా తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నారు.
ఆ డబ్బుతో ప్రియాంక గ్రాఫిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. కొద్దిరోజులు వీరి వ్యాపారాలు బాగానే ఉన్నప్పటికీ కరోనా ప్రభావం వారిని దెబ్బతీసింది. దీంతో ఫైనాన్స్ డబ్బును రొటేషన్ చేయడంలో తడబడ్డారు. దీంతో ఫైనాన్స్ డబ్బులను ఇతర వ్యాపారాల్లోకి మళ్లించారు. ఈ సమయంలోనే కొందరు ఖాతాదారులు తమ డబ్బును వితడ్రా చేసుకోవడం, వడ్డీలు చెల్లించడంలో తడబాటు రావడంతో కొందరికి అనుమానం వచ్చింది.
తమ డబ్బును వాపస్ చేయాలని వారు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఇటు ఆస్తులను కాపాడుకోవడంతోపాటు అటు డిపాజిట్‌దారుల ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు నిందితులు ఐపీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకు ముహూర్తం ఖరారు చేసుకొని మొదట అరుణాచలం వెళ్లి వచ్చి మే 3వ తేదీన ఐపీ ఫైల్ చేశారు. నోటీసులు అందకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గత నెల 30న నేతాజీ, వాణీబాల, శ్రీహర్షలను అరెస్టు చేశారు. వాణీబాల గత నెల 31న పదవీ విరమణ చేశారు.