Road accident : విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రెడీమిక్స్ లారీని ఢీకొట్టింది. ట్రావెల్స్ బస్సు భీమవరం నుంచి హైదరాబాద్ వస్తుండగా టైరు పేలడంతో అవతలివైపు వస్తున్న లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ ఇద్దరికీ గాయాలయ్యాయి. ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కట్టంగూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.