హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ‘ప్రైవేట్ స్కూళ్లలో ఇంటర్ పాసైనోళ్లు.. డిగ్రీ ఫెయిలైనోళ్లే పాఠాలు చెప్తున్నారన్న’ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ప్రైవేట్ టీచర్లు భగ్గుమన్నారు. సీఎం హో దాలో ఆయన ఇలా మాట్లాడటాన్ని టీచర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. తమను దారుణంగా కించపరచడాన్ని జీర్ణించుకోలేక పో యిన టీచర్లు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆం దోళన బాటపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ప్రైవేట్ టీచర్లంతా ముక్తకఠంతో ఖండించడమే కాకుండా సీఎం తక్షణమే తమకు క్షమాపణ చెప్పాలని, వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమ మనోభావాలు దెబ్బతీసిన రేవంత్‌రెడ్డికి తమ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వద్ద చేయి చాచకుండా బతుకుతున్న తమపై ఎందుకింత అక్కసు అని మండిపడ్డారు. టీచర్ల మధ్య విభజన తెచ్చి సమాజానికి ఏం సంకేతాలివ్వదల్చుకున్నారని ప్రశ్నిస్తున్నారు. తాము ఎంఏ, ఎమ్మెస్సీ, బీఈడీ వంటి అర్హతలు కలిగి, ఒకటిరెండు మార్కులతో ఉద్యోగాలు కోల్పోయినవారమని, తమను ఇలా అవమానించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి గతంలో ప్రభుత్వ టీచర్లపైనా నోరు పారేసుకున్నారు. ప్రభుత్వ విద్యకు కేటాయించే బడ్జెట్లో మొత్తం టీచర్ల జీతాలకే సరిపోతున్నదని, ఒక్కో టీచర్ రూ. 60-80వేల జీతాలిస్తున్నామని, ఫలితంగా మౌలిక వసతులకు ఖర్చు చేయలేకపోతున్నామని వ్యాఖ్యానించారు.
విద్యాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 57 శాతం మంది ప్రైవేట్ టీచర్లే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40,958 స్కూళ్లున్నాయి. వీటిల్ల్లో 2,93,923 మంది పనిచేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లు 10,814 ఉండగా, వీటిలో 1,66,564 మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలో 26,826 బడులుంటే వీటిలో 1,13,403 మంది టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లు 65 శాతముంటే వీటిలో పనిచేస్తున్న టీచర్ల శాతం 33.58 మాత్రమే. 26.4 శాతమున్న ప్రైవేట్ బడుల్లో మాత్రం 56.67 శాతం టీచర్లు పనిచేస్తున్నారు.
విద్యాశాఖ తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1,25,058 టీచర్ పోస్టులున్నాయి. వీటిలో ప్రస్తుతం 1,03,759 మంది టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారు. అంటే 21,299 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజా టీచర్ల బదిలీలు, పదోన్నతులతో మరో 6 వేలకుపైగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఈ మార్చి నుంచి రాష్ట్రంలో టీచర్ల పదవీ విరమణలు మొదలయ్యాయి. ఈ ఐదు నెలల కాలంలో మరో 4 వేలపైగా టీచర్లు రిటైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరించింది. ప్రభుత్వం మెగా డీఎస్సీ వేయకపోవడంతో అర్హత ఉండీ ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేకపోతున్నామని, ఈ క్రమంలో బతుకుదెరువు కోసం ప్రైవేటు టీచర్లుగా పనిచేస్తున్న తమపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని టీచర్లు మండిపడుతున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో చేరుతున్న పిల్లల సంఖ్య ఏటా తగ్గుతున్నది. ఒక్క 2021-22 మినహా ప్రతి ఏటా ఎన్రోల్మెంట్ తగ్గుతూనే ఉంది. 2021లోనే నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు. అప్పట్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 26 లక్షలుండగా, ఇప్పుడది 18లక్షలకు చేరినట్టు విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. పిల్లలు లేరన్న సాకుతో కేంద్రం రేషనలైజేషన్ చేయమని పదేపదే చెబుతున్నది. ఒకే ప్రాంగణం, ఒక గ్రామంలోని బడులను విలీనం చేయాలని తరుచూ ఆదేశాలిస్తున్నది. ఇటీవల టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లోనూ ప్రభుత్వం అంతర్గతంగా రేషనలైజేషన్ నిబంధనలను అమలుచేసింది.
ఉపాధ్యాయులెవరైనా ఉపాధ్యాయులే. ప్రైవేట్, ప్రభుత్వం అంటూ వ్యత్యాసం తగదు. 33 లక్షల మంది విద్యార్థులకు చదువులు చెప్తున్న ఉపాధ్యాయుల పట్ల ఒక సీఎం అంత దారుణమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం. ప్రభుత్వ టీచర్లు అంత నిష్ణాతులే అయితే పదోన్నతులకు ‘టెట్’ నుంచి ఎందుకు మినహాయింపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రైవేట్ టీచర్లకు సీఎం వెంటనే క్షమాపణ చెప్పి, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. లేదంటే కార్యాచరణను ప్రకటిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం.
– అయినేని సంతోష్‌కుమార్, తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రైవేట్ ఉపాధ్యాయులను సీఎం కించపరిచారు. మా మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. సీఎం సభకు హాజరైన టీచర్ల పిల్లలు కూడా ప్రైవేట్ స్కూళ్లల్లో చదవడం లేదా? రూ.80వేల జీతం తీసుకునే టీచర్ పిల్లలకు రూ.8 వేల వేతనం తీసుకుంటున్న టీచర్ చదువు చెప్పడంలేదా. చాలీచాలనీ జీతాలతో, సెలవుల్లేకుండా, ప్రభుత్వంపై భారం పడకుండా మంచి ర్యాంకులు, మార్కులు సాధిస్తున్నాం. మా శ్రమను గుర్తించకుండా కించపరచడం బాధాకరం. ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెబుతాం. 10న ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
– షబ్బీర్ అలీ, తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు
ప్రైవేట్ పాఠశాలల్లో ఇంటర్ పాస్, డిగ్రీ ఫెయిల్ అయిన అన్ట్రెయిన్డ్ టీచర్లతో బోధన సాగుతుందనడం సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావు. గత విద్యాసంవత్సరం వరకు రాష్ట్రంలో లక్షల మంది ఉపాధ్యాయులు టీపీటీ, హెచ్‌పీటీ, బీఎడ్, డీఈడీ కోర్సుల్లో శిక్షణ పొందినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలే ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారనే విషయం సీఎం రేవంత్‌రెడ్డి మరిచిపోయారు. ట్రస్మా అసోసియేషన్ ద్వారా ఉపాధ్యాయులకు పలు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్, ప్రజ్ఞా టీచర్స్, వికాసానికి సంబంధించిన అంశాల్లో శిక్షణ ఇస్తున్నాం. ప్రైవేట్‌లో పనిచేసే ఉపాధ్యాయులను 58 శాతం విద్యార్థుల తల్లిదండ్రులు మెచ్చుకోవడం ఇక్కడ జరిగే విద్యాబోధనకు నిదర్శనం. సీఎం వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం.
-యాదగిరి శేఖర్‌రావు, ట్రస్మా గౌరవాధ్యక్షుడు
రాష్ట్రంలోని ప్రైవేట్ ఉపాధ్యాయులనుద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార గర్వంతో మాట్లాడినట్టుగా ఉంది. వ్యయ ప్రయాసలకోర్చి ఉన్నత విద్యాభ్యాసాలు పూర్తి చేసుకున్న మాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ‘ఆడలేనమ్మ మద్దెల ఓడన్నట్టు’గా రేవంత్‌రెడ్డి సర్కా రు ఎన్నికల మ్యానిఫెస్టోలో మెగా డీఎస్సీ వేస్తాం అని ప్రగల్భాలు పలికి.. అధికార పగ్గాలు చేపట్టాక ప్రైవేట్ ఉపాధ్యాయులను కించపరిచేలా మాట్లాడటం సబబు కాదు. రేవంత్‌రెడ్డి ప్రైవేట్ టీచర్లపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి.
-సరిత (బీఎస్సీ, బీఈడీ) ప్రైవేట్ ఉపాధ్యాయురాలు, రాయపర్తి, వరంగల్ జిల్లా
ఎల్బీ స్టేడియంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ప్రైవేటు ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను గుర్తించే పెద్ద సంఖ్యలో విద్యార్థులను పంపిస్తున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఉపాధ్యాయుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం సరికాదు. ప్రైవేటు పాధ్యాయులకు అండగా ఉంటారని, వారికి ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటారనుకుంటే.. ఇలా కించపర్చినట్టు మాట్లాడటం బాధాకరం. ముఖ్యమంత్రి వెంటనే ప్రైవేటు ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు క్షమాపణ చెప్పాలి.
-పోకల నాగయ్య, అధ్యాపకుల సంఘం రాష్ట్ర కో-ఆర్డినేటర్