హైదరాబాద్, అక్టోబర్15 (నమస్తే తెలంగాణ) : ‘ఆవు కంచె మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?’ అనే సామెత ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యనేత మొదలు ఎమ్మెల్యేల వరకు అత్యధిక శాతం మందిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అధికార పీఠం ఎక్కిన తొలినాళ్లలో ప్రభుత్వ పెద్దలు కొందరు సీనియర్ ఐఏఎస్‌లకు ఫోన్ చేసి తమ కోసం ఒక మేలు చేసి పెట్టాలని అడిగారట. తప్పో, ఒప్పో పక్కనపెట్టి ప్రయోజనం కల్పించాలని కోరారట. దీంతో సదరు సీనియర్ బ్యూరోక్రాట్లు చట్టవిరుద్దమైన పనులను ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా చేసి పెట్టారట. ఇదే అదనుగా కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు సచివాలయం బయట ప్రైవేట్ కార్యాలయాలు తెరిచారని, జిల్లాలో కలెక్టరేట్ల బయట క్యాంపులు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భార్య, బంధువులనే ఏజెంట్లుగా పెట్టుకొని ప్రైవేటు వ్యక్తులతో డీల్ మాట్లాడుకుంటున్నారే ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు వారిని నియంత్రించడం ప్రభుత్వ పెద్దల వల్ల కూడా కావడం లేదని సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
బాస్ ఇచ్చిన చనువుతో కొందరు బ్యూరోక్రాట్లు చేను మేయడం మొదలు పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులు చేసి పెట్టడం, ప్రభుత్వ భూములను అప్పనంగా ప్రైవేట్ వ్యక్తుల పరం చేసి వాటాలు తీసుకోవడం వంటివి చేసి, నల్ల డబ్బులు పోగేసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలోని 10-12 మంది ఏఐఏస్లు ఏకంగా రూ.500 కోట్ల క్లబ్బులో చేరిపోయారని సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు హైదరాబాద్ మహానగరం చూట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో బినామీ ఆస్తులు కూడబెట్టి, ఫాం హౌజ్‌లు కడుతున్నట్టు స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. మరికొందరు డబ్బును వివిధ రూపాల్లో సొంత రాష్ర్టాలకు తరలిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఈ అక్రమ సంపాదనలో పొరుగు రాష్ర్టాల అధికారుల పెత్తనమే ఎక్కువని అంటున్నారు. మొదట్లో సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర కీలక మంత్రుల చెప్పు చేతల్లో వీళ్లు పనిచేసేవారని, కానీ ఇప్పుడు సీఎం, మంత్రులను ఖాతరు చేసే పరిస్థితి లేదని బ్యూరోక్రాట్లలోని మరో వర్గం చెప్తున్నది. ఢిల్లీ కాంగ్రెస్ ముఖ్యనేతతో అంటకాగే ఒక కీలక నేత వీళ్ల పోస్టింగు బాధ్యతలు చూసుకుంటున్నట్టు సమాచారం. ఆయన అడిగినంత డబ్బు కొట్టి సీఎం ప్రమేయం లేకుండానే కొరుకున్న చోటికి పోస్టింగులు తెచ్చుకుంటున్నట్టు సచివాలయంలో చర్చ జరుగుతున్నది. వీరికి ముకుతాడు వేసి పరిపాలనను పరిగెత్తించలేక సీఎం రేవంత్‌రెడ్డి చతికిల పడ్డారని విమర్శలు వస్తున్నాయి. అందుకే 22 నెలల నుంచి సీఎం కానీ, ఆయన మంత్రులు కానీ ఏ ఒక్క శాఖ మీద సంపూర్ణమైన పట్టు సాధించలేకపోయారని అంటున్నారు. దాదాపు 11 శాఖలు తన దగ్గర పెట్టుకున్న సీఎం ‘ఈ శాఖలో ఇది నేను సాధించిన విజయం. ఇది నా ప్రైడ్ సబ్జెక్ట్’ అని చెప్పుకోవటానికి ఒక్కటి కూడా లేదని అంటున్నారు.
కాంగ్రెస్ పాలనలో అతిగా సంపాదిస్తున్నట్టు ఆరోపణలు ఉన్న ఐఏఎస్ అధికారులపై ఏసీబీగానీ కేంద్ర నిఘా వర్గాలుగానీ దాడులు చేస్తే దేశమే నిర్ధాంతపోయేలా నల్ల డబ్బు, అక్రమ ఆస్తులు బయట పడుతాయని పేరు చెప్పటానికి ఇష్టపడని ఒక అధికారి తెలిపారు. సచివాలయంలో తిష్ట వేసిన కొందరు అధికారులు అక్రమాలను సక్రమంగా రికార్డుల్లో చేర్చడంలో రాటుదేలిపోయారని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఫైళ్ల వైపు వీళ్లు కన్నెత్తి చూడరని, సార్ల సంతకాల కోసం అవి నెలల తరబడి టెబుళ్లపై మూలగాల్సిందేనని అంటున్నారు. వీరి దృష్టి అంతా లబ్ధి చేకూర్చే ఫైళ్లమీదే ఉంటుందన్నారు. ఫైల్ ఎంత అక్రమం అయితే, అంత రేటు ఫిక్స్ చేస్తున్నారని సమాచారం. ఒకసారి డీల్ కుదిరి, అడ్వాన్స్ ముడితే చాలు అవన్నీ సక్రమం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. రూ.వందల కోట్ల ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయని, రూ.వేల కోట్ల టెండర్లు ఖారారై పోతున్నాయని, గుట్టుచప్పుడు కాకుండా నిధులు ఖజానా నుంచి ప్రైవేటు సంస్థల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తాయని చెప్తున్నారు. ఇటీవల కార్మిక శాఖ నుంచి గ్రూప్ ఇన్సూరెన్స్ పేరుతో రూ.349 కోట్లు కార్మిక సంక్షేమ నిధి సొమ్మును దారి మళ్లిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డికి తెలిసి కూడా సదరు అధికారులను కనీసం మందలిచ్చే సాహసం కూడ చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. బాలానగర్ మండలం ఫతేనగర్ గ్రామంలో సర్వే నంబర్ 80,81 లో ఉన్న అర్బన్ సీలింగ్ యాక్ట్, వక్ఫ్ బోర్డు భూమి మీద ప్రైవేట్కంపెనీ కన్నేసింది. కేసీఆర్ సీఎంగా ఉండగా అడ్డం పడ్డారని, హైకోర్టులో పిల్వేసి ఆ భూములు పోకుండా కాపాడారని అంటున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత సీఎంవోలో పని చేసిచేస్తున్న ఒక కీలక అధికారి సూచనలతో ప్రైవేటు కంపెనీ సుప్రీంకోర్టుకు వెళ్లిందట. కోర్టు అడిగిన రికార్డులను రెవిన్యూ అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా దాచిపెట్టడంతో, తీర్పు ఆ సంస్థకు అనుకూలంగా వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో తీర్పు కాపీ ఆధారంగా, సీఎంవో అధికారి మంత్రాంగంతో యూఎల్సీ భూమి ప్రైవేటు పరం అయ్యిందని చర్చ జరుగుతున్నది. ఇవి ఉదాహరణలు మాత్రమే అని ఇలాంటివెన్నో జరుగుతున్నాయని బ్యూరోక్రాట్లలో చర్చ జరుగుతున్నది.
ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులు భార్య, బంధువుల సాయంతో ఏజెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని సమాచారం. సదరు అధికారి వద్ద పనిచేసే నమ్మకమైన కిందిస్థాయి అధికారి ఒకరు వీళ్లకు సహాయం చేస్తున్నారట. వారు సచివాలయం సమయం ముగిసిన వెంటనే, ఫైళ్లను సంచుల్లో వేసుకొని నేరుగా ప్రైవేటు కార్యాలయానికి వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అక్కడ ఎంత సంక్లిష్టమైన ఫైల్ అయినా ఇట్టే పరిషారమై పోతాయని అంటున్నారు. ఒక ఐఏఎస్ అధికారి ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేశారట. ఆశాఖలోని గ్రీన్ ఇంక్ ఉన్న అధికారులను నాలుగు భాగాలు చేశారని, దిగువ స్థాయి అధికారుల బదిలీకి రూ.10 లక్షలు, అత్యంత ఎగువ స్థాయి అధికారి బదిలీకి రూ.50 లక్షలు చొప్పున ఫిక్స్ చేశాడట. పైసలు చేతిలో పడితేనే పెన్ను ముందు పడుతుందని ఆ శాఖ ఉద్యోగులు చెప్తున్నారు. అదే శాఖలో రూ.3 వేల కోట్ల సామాగ్రి కొనుగోలులో 4 శాతం కమీషన్ తీసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆ శాఖ మీద వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నాయని చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే తాజాగా ఒక భారీ తిమింగలాన్ని పట్టుకున్న విషయం తెలిసిందే. ఆ శాఖకు కీలక బాధ్యతలు చూస్తున్న సీనియర్ ఐఏఎస్ ఏకంగా నల్లధనం చేతిలో పట్టుకొని తిరుగుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల వరకు హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టిన సదరు అధికారులు, ఇప్పుడ రూట్ మార్చి దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపకల ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం
పలువురు కలెక్టర్లు జిల్లాల్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సన్నిహితంగా మెదులుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సచివాలయంలో చక్రం తిప్పగలిగే స్థాయిలో ఉన్న కొందరు కలెక్టర్లు ఏకంగా పలు వ్యాపారల్లో పెట్టుబడులు పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. రాజకీయ నేతల తరహాలో తమ ఫ్యామిలీ మెంబర్ల ద్వారా సెటిల్మెంట్లు చేయిస్తున్నట్టు, బినామీ పేర్ల మీద ఆస్తులు కూడబెడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ల అక్రమ వ్యవహారం సీఎంవో దృష్టికి రావటంతో కాన్ఫరెన్స్ నిర్వహించి అవినీతి విషయంలో సీఎం సీరియస్‌గా హెచ్చరించినా వీళ్లు ఖాతరు చేయనట్టు తెలిసింది. హైదరాబాద్ సమీప జిల్లాలో పని చేస్తున్న ఒక యువ కలెక్టర్ ప్రతి పనికి 15 శాతం ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఓ కాంగ్రెస్ నేతతో స్నేహం పెంచుకొని ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. కెరీర్ పరంగా ఎంతో భవిష్యత్తు ఉన్న సదరు కలెక్టర్ అన్నింటినీ గాలికి వదిలేసి అక్రమాస్తులకు తెగబడినట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.