హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్ల దందాకు తెరలేపాయి. పదోతరగతి వార్షిక పరీక్షలకు ముందే అడ్వాన్స్‌గా ఇంటర్ అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. ఇందుకోసం విద్యాసంస్థలు పీఆర్వోలు, మార్కెటింగ్ సిబ్బందిని రంగంలోకి దింపాయి. తల్లిదండ్రులకు మాయమాటలు చెప్తూ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు అడ్మిషన్ పొందితే ఒక ఫీజు.. ఆలస్యమైతే మరో ఫీజు అంటూ స్పెషల్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే ఫీజులు కూడా చెల్లించినట్టు తెలిసింది. కాలేజీల ప్రతినిధులు అడ్మిషన్ల కోసం పోటీపడుతుండటంతో తల్లిదండ్రులకు నాలుగైదు కాలేజీల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. రోజుకో కాలేజీ ప్రతినిధులు వచ్చి బుర్ర తింటున్నట్టు తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇంత జరుగుతుంటే ఇంటర్‌బోర్డు అధికారులు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు, విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
ముందస్తు ప్రవేశాలు..నిబంధనలకు విరుద్ధం
ఇటీవలే పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. పరీక్షలు మార్చిలో మొదలై ఏప్రిల్‌లో ముగుస్తాయి. ఇంటర్ అడ్మిషన్ల కోసం ఇంటర్‌బోర్డు కాలేజీలకు అనుమతి జారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అడ్మిషన్స్ నోటిఫికేషన్ జారీ చేసి, విద్యార్థులను చేర్చుకోవాలి. కానీ అఫిలియేషన్లు, అడ్మిషన్ నోటిఫికేషన్‌కు ముందే కాలేజీలు సీట్లు భర్తీ చేసుకుంటున్నాయి. ముందస్తు అడ్మిషన్లు నిబంధనలకు విరుద్ధం. కానీ ఇంటర్‌బోర్డు అధికారులు, డీఐఈవోలు, నోడల్ అధికారులు చోద్యం చూస్తున్నారని, పరోక్షంగా ప్రైవేట్ దందాకు సహకరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త!
ఇంటర్ అడ్మిషన్ల విషయంలో తల్లిదండ్రులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విద్యావేత్తలు సూచిస్తున్నారు. గతంలో జరిగిన పలు ఉదంతాలను ఉదహరిస్తున్నారు. విద్యార్థులు కాలేజీలు, వసతి గృహాల వాతావరణానికి అలవాటు పడుతారో లేదో.. అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తే కట్టిన ఫీజు పరిస్థితి ఏంటి… వంటి విషయాలను ఆలోచించాలని చెప్తున్నారు. గతంలో అడ్మిషన్స్ రద్దు చేసుకోవాలని భావించిన తల్లిదండ్రుల పట్ల ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఎంత దురుసుగా ప్రవర్తించాయో వివరిస్తున్నారు. కాలేజీలో చేరిన కొన్ని రోజులు, వారాల తర్వాత అడ్మిషన్ రద్దు చేసుకున్నా సగం ఫీజు కూడా వెనక్కి ఇచ్చే పరిస్థితి ఉండదని అనుభవాలు చెప్తూ హెచ్చరిస్తున్నారు.
ప్రైవేట్ కాలేజీలా.. కాల్ సెంటర్లా?