హైదరాబాద్, జూలై 17(స్పెషల్ టాస్క్బ్యూరో, నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో ఆ భూములను ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించినట్టుగా రికార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఆ భూములన్నీ ప్రభుత్వ భూమిలైనందున నిషేధిత జాబితాలో ఉన్నట్టు భూభారతి ఆన్లైన్ పోర్టల్ చూపుతున్నది. ఆ భూముల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ చేయవద్దని ఈ ఏడాది ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్‌శాఖకు రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి రాసిన లేఖ చెబుతున్నది. కానీ రికార్డులు లేవు..! ఆధారంగా డాక్యుమెంట్లు అసలే లేవు!! అయినా ప్రైవేటు వ్యక్తులు ఆ భూముల్లో యథేచ్ఛగా మూడు రోజుల నుంచి భారీ యంత్రాలతో పనులు చేస్తున్నారు. పెద్దఎత్తున బౌన్సర్లను పెట్టుకొని చుట్టూ ఫెన్సింగ్ నిర్మిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు… అందునా తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు తహసీల్దార్ మొదలు ఆర్డీవో, కలెక్టర్, ముఖ్య కార్యదర్శి చివరకు రెవెన్యూశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. ‘ఒర్లి ఒర్లి మీరు పోతరు.. వండుకతిని వాళ్లు పోతరు’ అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. 18 నెలలుగా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువుల ఎఫ్టీఎల్-బఫర్‌జోన్, ప్రభుత్వ భూముల్లో ఉన్నాయంటూ అనుమతులు ఉన్న సామాన్యుల ఇండ్లను కూల్చివేస్తున్న ప్రభుత్వం ఎకరా రూ.100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వాళ్లకు అప్పగించింది. నెత్తీ నోరు కొట్టుకుంటున్న ఉద్యోగ జేఏసీ నేతలకు ‘మీ దిక్కున్న చోట చెప్పుకోండి!’ అని అంటున్నది. ఇంతకూ.. ప్రభుత్వం ఉన్నట్లా? లేనట్లా?! రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి సర్వేనెంబరు 36లో అసలేం జరుగుతున్నది??
గతంలో భాగ్యనగర్ టీఎన్జీవోలోని ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించిన గోపన్‌పల్లి సర్వేనంబర్ 36లోని భూముల్లో ప్రైవేటు వ్యక్తుల హవా కొనసాగుతున్నది. ఒకవైపు ఉద్యోగులు వేలాదిగా వచ్చి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది. ఇదెక్కడి అన్యాయం అంటూ ఉద్యోగులే… ఉద్యోగులైన రెవెన్యూ అధికారుల దగ్గరికు పోతే ‘పైకి’ చూపిస్తున్నారు. గురువారం సాయంత్రం నాటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి ఆన్లైన్ పోర్టల్‌లో సర్వేనంబర్ 36కు సంబంధించి.. కేవలం ఐదుగురి పేర్లను మాత్రమే చూపుతున్నది. అవి కూడా అసైన్డ్ భూములుగానే నమోదు కాగా కోర్టు వివాదాల్లో ఉన్నట్టుగా అందులో పొందుపరిచారు.
మరోవైపు ఇదే పోర్టల్‌లోని 22-ఏ నిషేధిత జాబితాలో ఈ సర్వేనంబర్‌లోని 460.14 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా చూపిస్తున్నారు. ముఖ్యంగా ఇందులోని భూములపై ఎలాంటి క్రయవిక్రయాలు జరపవద్దని గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు చాలాసార్లు రిజిస్ట్రేషన్‌శాఖకు లేఖలు రాశారు. ప్రస్తుత కలెక్టర్ నారాయణరెడ్డి కూడా ఈ ఏడాది ఏప్రిల్ 7న రిజిస్ట్రేషన్‌శాఖకు పంపిన నిషేధిత జాబితాలో దాదాపు 460.14 ఎకరాలను ప్రభుత్వ భూమిగా చూపారు. పలువురు అసైనీల పేరిట ఉన్న ఈ భూములను ప్రభుత్వం పీవోటీ కింద సేకరించినట్టుగా కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ఏ రూపంలో చూసినా అవి ప్రభుత్వ భూములే అనేది అధికారిక రికార్డుల సారాంశం.
సర్వేనంబర్ 36లో గత మూడు రోజులుగా ఒక ప్రైవేటు నిర్మాణ కంపెనీకి చెందిన వ్యక్తులు యథేచ్ఛగా భారీ యంత్రాలతో పనులు నిర్వహిస్తున్నారు. భాగ్యనగర్ టీఎన్జీవోలు బుధవారం ఉదయం ఆందోళన మొదలుపెట్టిన సమయంలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేయడంతో కొన్ని గంటలపాటు పనులు నిలిపివేశారు. ఆ తర్వాత సాయంత్రం మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణ టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ బుధవారం రాత్రి స్వయానా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటికి మళ్లీ పనులు మొదలయ్యాయని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కానీ గురువారం కూడా పనులు కొనసాగాయి.
ఉద్యోగ సంఘాల నేతలు పోలీసులను కలిసినప్పుడు కూకట్పల్లి కోర్టు ఇంజక్షన్ ఉత్తర్వులను చూపారు. మరి దాని ఆధారంగా రెవెన్యూశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందా? అంటే అందుకు ఎలాంటి ఆధారాలూ చూపడం లేదు. పైగా కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న 36/ఏ అనే సర్వేనంబర్ అసలు రికార్డుల్లోనే లేదు. 36/ఇ అని చూపిన సబ్ డివిజన్ ప్రభుత్వ భూమి అని, గతంలో పీవోటీ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్ శాఖకు రాసిన లేఖలోనే ఉంది.
మరి అలాంటప్పుడు సదరు ప్రైవేటు వ్యక్తులకు ఉన్న ఆధారమేంటి? శేరిలింగంపల్లి తహసీల్దార్ చెప్పిన ఎన్వోసీలను కలెక్టర్, రాజేంద్రనగర్ ఆర్డీవోలో ఎవరూ బహిర్గతం చేయకపోవడం వెనుక ఆంతర్యమేంటి? ప్రభుత్వ భూమిలో నిరుపేద గుడిసె వేసుకుంటే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కండ్ల ముందు, బహిరంగంగా, ఎలాంటి ఆధారాలూ చూపకుండా దాదాపు 30 ఎకరాల్లో.. అంటే, సుమారు రూ.3వేల కోట్ల విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులు స్వాధీనం చేసుకోవడాన్ని జనం ఏమని అర్థం చేసుకోవాలి?!
ప్రభుత్వం తమకు కేటాయించిన సర్కారు భూములు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించి.. పనులు నిర్వహిస్తున్నారంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కు కరువైంది. మూడు రోజులుగా జేఏసీ నేతలు మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రైవేటు వ్యక్తుల పనులు ఆగకపోవడంతో గురువారం మధ్యాహ్నం నేతలు సచివాలయంలో రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి లోకేశ్కుమార్ను కలిశారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ, భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవోల (గచ్చిబౌలి) హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్ ఫిర్యాదు కాపీ ఇచ్చారు. అయితే ఈ భూమి విషయం తన దృష్టికి రాలేదని లోకేశ్‌కుమార్ సమాధానమిచ్చినట్టు తెలిసింది.