ఇబ్రహీంపట్నం, మే 10: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ (Private Hospitals) కేంద్రం ప్రైవేటు దవాఖానాలకు కేరాఫ్‌గా మారింది. గల్లీకో దవాఖానాను ఏర్పాటుచేసి అర్హతలేని వైద్యులు, వైద్య చికిత్సలపై ఏమాత్రం అనుభవంలేని నర్సులను నియమించి పేద ప్రజల దగ్గర దవాఖానాల పేరిట పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లుకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రులు వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. ప్రముఖ వైద్యులపేరిట ఆస్పత్రులకు అనుమతులు తీసుకుని స్టాఫ్ నర్సులు, ఆర్ఎంపీలతో వైద్యశాలలు కొనసాగిస్తున్నారు.
అనుభవం, అర్హత ఉన్న డాక్టర్ల పేరుతో ఆస్పత్రులను నెలకొల్పి.. వైద్యులు నగరంలో ఎక్కడో ఉంటూ, స్థానికంగా ఉన్న నర్సులతో వాట్సప్ కాల్స్ ద్వారా వైద్య చికిత్సలు కొనసాగిస్తున్నారు. డబ్బుల సంపాదనే పరమావదిగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. లక్షల్లో ఫీజులు వసూళ్లు చేస్తూ అమాయకపు ప్రజలను నిండా ముంచుతున్నారు. దీనిపై స్పందించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది.
పట్టణంలో సుమారు 20 వరకు ప్రైవేటు దవాఖాలను నెలకొల్పి వాటిలో స్టాప్ నర్సుల ద్వారా చికిత్సలు నిర్వహించి అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని మంచాల రోడ్డులోగల విజయలక్ష్మి ఆస్పత్రిలో ఓ మహిళకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించగా, అది వికటించింది. ఆ సంఘటన మరువకముందే నగరంలో ఉన్న వైద్యురాలు.. స్టాప్ నర్సుల చేత వాట్సప్‌కాల్‌లో వైద్య చికిత్సలు చేయించటం ద్వారా ఓ తల్లి కడుపులోనే ఇద్దరు కవలల పిల్లలు మృతిచెందారు.
ప్రైవేటు దవాఖానల్లో కొనసాగుతున్న బ్రూణహత్యలు…
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో గతంలో ఓ ప్రైవేటు దవాఖానలో డెలవరీ కోసం వచ్చిన ఓ గిరిజన మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అప్పటికే ఆ మహిళకు ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో తనకు మగబిడ్డ కావాలనుకుంటే ఆడబిడ్డ పుట్టిందని, ఈ బిడ్డను నేను సాకలేనని చెప్పటంతో ఆ ఆస్పత్రి యాజమాన్యం ఆడబిడ్డను ఇతరులకు విక్రయించేందుకు సహాయంచేసింది. దీంతో వైద్యారోగ్యశాఖ అధికారులు ఆ దవాఖానను సీజ్ చేశారు. మల్లీ రెండు నెలల తర్వాత అదే వైద్యులు పేరుమార్చి దవాఖానాను కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇబ్రహీంపట్నంతోపాటు యాచారం మండలం మాల్లోని పలు ప్రైవేటు హాస్పిటళ్లలో కడుపులోనే ఆడబిడ్డలను చిదిమేస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన తండాల్లోని ఆర్ఎంపీ డాక్టర్ల ద్వారా ఈ ఆస్పత్రులకు రెఫర్ చేయించుకుని ఆడబిడ్డలు ఉంటే కడుపులోనే చిదిమేస్తున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవల్సిన వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవటం లేదని గ్రామీణప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రైవేటు ఆస్పత్రికి పోతే భయం.. భయం..
ఓవైపు ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్య చికిత్సలు నిర్వహించటంలేదు, వైద్యులు కూడా సకాలంలో అందుబాటులోకి రాకపోవటంతో చేసేదేమీలేక ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యులు లక్షల ఫీజులు వసూళ్లు చేస్తూ పేదప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అర్హతలేని వైద్యులతో వైద్య చికిత్సలు నిర్వహిస్తూ… ఆస్పత్రుల్లోనే మెడికల్ షాప్‌లను ఏర్పాటు చేసుకుని, అవసరం లేని మందులు రాసి వేలల్లో డబ్బులు వసూళ్లుచేసి మల్లీ తిరిగి అవే మందులు మెడికల్షాప్కి తీసుకెల్లి విక్రయిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలొస్తున్నాయి. ఇలాంటి వాటిపై ఓ కన్నేసి చర్యలు తీసుకోవల్సిన ప్రభుత్వ అధికారులు కాసులకు కక్కుర్తి పడి పట్టించుకోవటంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
అందుబాటులో ఉండని వైద్యులు..
ప్రైవేటు ఆస్పత్రులను స్థాపించిన వైద్యులు, యాజమాన్యాలు అందుబాటులో ఉండరు. ఇక్కడ ఆస్పత్రిని ఏర్పాటుచేసి వారు నగరంలోని పెద్దపెద్ద దవాఖానాల్లో చికిత్సలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఎమర్జెన్సీగా ఎవరైనా వైద్యంకోసం వస్తే నగరం నుంచే ఆన్లైన్లో ఇక్కడ ఉన్న అనుభవం లేని నర్సులతో చికిత్సలు చేయిస్తున్నారు. దీంతో ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అలాగే, గంటల తరబడి వైద్యుల కోసం నిరీక్షించి.. నిరీక్షించి ప్రాణాలు పోగొట్టుకోవల్సిన పరిస్థితులు కూడా దాపురిస్తున్నాయి. ఒకరిపేరున ఆస్పత్రి ఏర్పాటుచేస్తారు. ఆయన ఎవరో కూడా ఇక్కడ ఉండరు. అర్హత ఉన్న ఓ వైద్యుని పేరున ఆస్పత్రి ప్రారంభించి ఆయనకు ఎంతో కొంత ముట్టచెప్పి.. ఇక్కడ ఆస్పత్రిని మాత్రం అర్హతలేని నర్సులతో, ఆర్ఎంపీ డాక్టర్లతో నిర్వహిస్తున్నారు. ఇలాంటి వారిపై పూర్తి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హతలేని ఆస్పత్రులను తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.