హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏర్పాటుకావాల్సిన పరిశోధన కేంద్రాలకు (రీసెర్చ్ సెంటర్) జేఎన్టీయూ అధికారులు మంగళం పాడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిశోధన కేంద్రాల ఏర్పాటు కోసం ఏడాది క్రితమే దరఖాస్తు చేసుకున్నా అనుమతులు ఇవ్వడంలో జేఎన్టీయూ తాత్సారం చేస్తున్నదని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు ఆరోపిస్తున్నాయి. అనుమతుల మంజూరులో ఎందుకు ఆలస్యం చేస్తున్నారన్న ప్రశ్నలకు యూనివర్సిటీ అధికారులు సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని, దీంతో అనుమానాలు కలుగుతున్నాయని బాధిత కాలేజీ యాజమాన్యాలు చెప్తున్నాయి.
పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు అనుమతుల విషయంలో యూనివర్సిటీ ఆలస్యం చేస్తుండటం వల్ల తమ కాలేజీల ప్రతిష్ఠ దెబ్బతింటున్నదని, ఆ ప్రభావం అడ్మిషన్లపైనా పడుతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు పరిశోధన కేంద్రాల నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయని వాపోతున్నారు. కాలేజీల్లో పరిశోధన కేంద్రాల ఏర్పాటు వల్ల రీసెర్చ్ స్కాలర్లకు సబ్జెక్టుల వారీగా గైడ్లు లభిస్తారు. అంతేకాకుండా డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సీఎస్ఐఆర్, డీఆర్డీవో వంటి పలు జాతీయ సంస్థల నుంచి ప్రాజెక్టులతోపాటు విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా వస్తాయి. కాబట్టి, వీలైనంత త్వరగా తమ కాలేజీల్లో పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు అనుమతులివ్వాలని కాలేజీ యాజమాన్యాలు కోరుతున్నాయి.
రాష్ట్రంలోని దాదాపు 100కుపైగా ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకున్న మాట వాస్తవమేనని జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు తెలిపారు. వాటిలో ఐదు కాలేజీలు కొత్తగా దరఖాస్తు చేసుకోగా, 49 కాలేజీలు రెన్యువల్ చేసుకోవడానికి అర్హత సాధించాయని పేర్కొన్నారు. ఆయా కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి, ప్రమాణాలు పరిశీలించి అనుమతులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించినట్టు వెల్లడించారు. ఈసారి కొన్ని నిబంధనలు మార్చబోన్నట్టు తెలిపారు. అయితే, ఎప్పటిలోగా అనుమతులు ఇస్తారో రిజిస్ట్రార్, సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.