Private Colleges | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి పలు రకాల వృత్తి విద్యాకాలేజీల్లో కోరినంత ట్యూషన్ ఫీజులు చెల్లించలేదన్న కారణాలతో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లను ప్రైవేటు కాలేజీలు నిలిపివేస్తున్నాయి. ఈ విధానం రాష్ట్రంలో మూడు దశాబ్దాల నుంచి వస్తున్నది. దీంతో విద్యార్థులు నరకయాతన పడుతున్న సందర్భాలు కోకొల్లలు. ఇది వారి భవితవ్యంపైనా ప్రభావం చూపింది. ఈ విషయమై బాధిత విద్యార్థుల నుంచి ప్రభుత్వానికి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి.
ఈ కష్టాల నుంచి విద్యార్థులకు ఉపశమనం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఈ నేపథ్యంలో సర్కారు ఆదేశాలతో జేఎన్టీయూ శనివారం అన్ని కాలేజీలకు నోటీసులు జారీచేసింది. ఒరిజినల్ సర్టిఫికెట్లు నిలిపివేసే కాలేజీలను బ్లాక్‌లిస్టులో చేరుస్తామని జేఎన్టీయూ అధికారులు హెచ్చరించారు. అఫిలియేషన్ రద్దు చేస్తామని, ఫీజు రీయింబర్స్మెంట్ నిలిపివేస్తామని స్పష్టం చేశారు.