హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో ఆగమేఘాలపై విలీనం చేయొద్దని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్(టీపీజేఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఐఏఎస్‌ల అస్తవ్యస్త నివేదికతో ముందుకెళ్తే ఇబ్బందులు తప్పవని సర్కార్‌ను హెచ్చరించింది. ఇంటర్‌బోర్డు విలీనానికి సర్కార్ కసరత్తు నేపథ్యంలో టీపీజేఎంఏ శనివారం హైదరాబాద్‌లో అత్యవసరంగా సమావేశమైంది. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న పలువురు కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు ఇంటర్ విద్యపై జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో విద్య పరిస్థితి చూస్తుంటే.. ఇంటర్ విద్యను హత్య చేసేందుకు ప్రభుత్వం పూనుకున్నన్నట్టు తెలుస్తున్నదని పలువురు కాలేజీ కరస్పాండెంట్లు ఆరోపించారు. జూనియర్ కాలేజీల్లో 9,10 తరగతుల నిర్వహణకు అనుమతులివ్వాలని డిమాండ్ చేశారు. విలీనం చేస్తూ ఆర్డినెన్స్ జారీచేస్తే జరిగే నష్టంపై ఉద్యమిస్తామని ప్రకటించారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు
ఇంటర్‌బోర్డు అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేసి, వెంటనే వాయిదావేయడం గమనార్హం.10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో సర్కార్ ఆడుకోవద్దు. విలీన పాలసీపై ఓ స్పష్టత లేదు. ఎలా అమలుచేస్తారో తెలియదు. ఏ విధంగా ముందుకెళ్తారో చెప్పని పరిస్థితి. ఎన్ఈపీ అమలు, బోర్డుల విలీనంపై రోడ్‌మ్యాప్ ప్రకటించాలి. కాలేజీల్లోనే 9,10 తరగతుల నిర్వహణకు అనుమతులివ్వాలి.
– గౌరి సతీశ్, టీపీజేఎంఏ అధ్యక్షుడు
నిపుణుల సూచనలు తీసుకోవాలి
రాష్ట్రంలో జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయడం మంచిదే. కానీ, కొత్త పాలసీని అడాప్ట్ చేసుకుంటున్న తీరు బాగా లేదు. విద్యాకమిషన్ నివేదిక పేరిట ఆదరబాదరాగా ఎలా చేస్తారు ?. ఎన్ఈపీ అమలు, ఇంటర్‌బోర్డు విలీన అంశాలపై నిపుణులు, విద్యావేత్తలతో చర్చించాలి. ఇందుకు సెమినార్లు నిర్వహించాలి. ఇవేమీ లేకుండా విలీనం చేస్తే ఇబ్బందులు తలెత్తడం ఖాయం.
– వరదారెడ్డి, టీపీజేఎంఏ వ్యవస్థాపక అధ్యక్షుడు