హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. అక్రమ ఫీజుల దందాకు తెరలేపాయి. కొత్తగా చేరిన కన్వీనర్ కోటా విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు గుంజుతున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ. 10వేల నుంచి 30వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి ఎప్సెట్ వెబ్ కౌన్సెలింగ్ రెండో విడత సీట్లను ఇటీవల కేటాయించారు. మొదటి, రెండో విడతలో సీట్లు వచ్చిన వారు ఈ నెల 2(శనివారం)లోగా కాలేజీల్లో సర్టిఫికెట్లు సమర్పించి, ఫిజికల్ రిపోర్ట్ చేయాలని సాంకేతిక విద్యాశాఖ అధికారులు సూచించా రు. అయితే దీనినే కాలేజీలు అస్త్రంగా మార్చుకున్నాయి. ఫిజికల్ రిపోర్టింగ్ చేసేందుకు వెళ్లిన విద్యార్థులను వేలకు వేల ఫీజులు కట్టమంటున్నాయి.
అడ్మిషన్, లైబ్రరీ, ల్యాబ్, యూనివర్సిటీ ఫీజులంటూ గుంజుతున్నాయి. మరీ దారుణమైన విషయం ఏంటంటే.. ‘ఆన్లైన్లో అయితే అస్సలు అంగీకరించం.. నగ దు అయితేనే తీసుకుంటాం’ అంటున్నాయి. కొన్ని కాలేజీలు అయితే సీటు వచ్చిన విద్యార్థులకు ఫోన్లు చేసి ‘ఇంత ఫీజు తీసుకురండి’ అంటూ ముందస్తు సమాచారాన్నిస్తున్నాయి. ఓ కాలేజీ మరీ బరితెగించింది. విద్యార్థి అడ్మిషన్ కోసం వెళితే ఫీజు కట్టాల్సిందేనంటూ చెప్పేసింది. ‘అయ్యో నాకు తెలియదు.. నేను అంత కట్టలేను’ అంటే ఫీజు కడితేనే కన్ఫర్మ్ చేస్తాం అంటూ హెచ్చరించింది. మీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి పోన్ పే ద్వారా చెల్లించండి అంటూ ఆప్షన్ ఇచ్చింది. విధిలేక కాలేజీ చెప్పినంత ఫీజును చెల్లించాల్సి వచ్చింది.
పోయినట్టే ప్రస్తుతం రెండో విడత సీట్ల భర్తీ పూర్తికాగా, ఈ నెల 5నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభంకానున్నది. ఫైనల్ ఫేజ్లో విద్యార్థులు సీట్లు మార్చుకుంటే, ఒక వేళ కాలేజీ మారితే కాలేజీల్లో చెల్లించిన మొత్తం కోల్పోయినట్టే. పైగా కొత్త కాలేజీలో ఎంత అడిగితే అంత కట్టాల్సిందే.